రూటు మార్చిన విద్యార్థులు.. ప్రభుత్వ కళాశాలల సరికొత్త రికార్డు!

by Shyam |   ( Updated:2021-08-12 22:47:53.0  )
Junior Colleges
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. గతేడాది 52 వేల మంది విద్యార్థులు అడ్మిషన్ పొందగా ఈ ఏడాది ఇప్పటికే 1.09 లక్షల మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. కరోనా పరిస్థితులు ఫీజుల భారంతో ప్రభుత్వ కళాశాలల వైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో 402 ప్రభుత్వ, 1686 ప్రైవేటు కళాశాలలుండగా వీటిలో ఈ ఏడాది 161 ప్రైవేటు కళాశాలలు మూతపడగా 426 కళాశాలలకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతులు మంజూరు చేయలేదు.

లక్ష దాటిన అడ్మిషన్లు

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది లక్షా 9వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ నెల 15 అడ్మిషన్లకు అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధ్యాపకులు భావిస్తున్నారు. గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,80,808 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా వీరిలో ప్రభుత్వ కళాశాలలో కేవలం 52వేల మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు. ఈ ఏడాది 50శాతం అధికంగా విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెరగడం విశేషం.

ఫీజుల భారంతో సర్కారు విద్యకు మొగ్గు

కరోనా పరిస్థితుల్లో ఫీజుల భారాన్ని తట్టుకోలేని పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆన్ లైన్ తరగతులకు వేలల్లో ఫీజులు చెల్లించడం ఇష్టం లేక ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు. థర్డ్ వేవ్ ప్రబలితే ఫిజికల్ తరగతులకు ఆస్కారం ఉండదనే భావనతో ప్రైవేటు కళాశాలకు వెళ్లడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం ఇంటర్ కళాశాలల ఫీజుల విషయంలో హేతుబద్ధతను అమలు చేయకపోవడం వలన ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు ఇష్టారీతిగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఈ బాధలను తట్టుకోలకనే సర్కారు విద్యకు మొగ్గు చూపుతున్నారు.

మూతపడిన 161 ప్రైవేటు కళాశాలలు

రాష్ట్రంలో మొత్తం 1686 ప్రైవేటు కళాశాలలుండగా వీటిలో ఈ ఏడాది విద్యార్థులు చేరకపోవడంతో 161 ప్రైవేటు కళాశాలలు మూతపడ్డాయి. ప్రతీ ఏడాది ప్రభుత్వం అందించే అనుమతులను ఈ ఏడాది 426 ప్రైవేటు కళాశాలలకు అందించలేదు. ప్రైవేటు కళాశాలల ఆవరణలో ఇతర భవన సముదాయాలు ఉండకూడదనే మిక్స్ డ్ ఆక్యూపెన్సి నిబంధనలు అమలు చేయడంతో ప్రైవేటు కళాశాలలు అనుమతులు పొందలేకపోతున్నాయి. దీంతో ప్రైవేటు కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పలు ప్రాంతాల్లో ప్రైవేటు కళాశాలలు మూతపడటం, అనుమతులు మంజూరు కాకపోవడం వలనే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వెళుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తుంది

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం, నాణ్యమైన విద్యను అందించడం వలనే విద్యార్థుల అడ్మిషన్లు లక్షకు పైగా నమోదవుతున్నాయి.
-మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఇంటర్ కళాశాలల పరిరక్షణ సమితి కన్వీనర్

మిక్స్‌డ్ ఆక్యూపెన్సి నిబంధనలు సడలించాలి

మిక్స్‌డ్ ఆక్యూపెన్సి నిబంధనలు సడలించకపోవడంతో రాష్ట్రంలో 426 కళాశాలలను ఇప్పటి వరకు అనుమతులు జారీ కాలేదు. దీంతో విద్యార్థులను అడ్మిషన్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. నష్టాలు చవిచూడాల్సి వస్తుండటంతో 161 చిన్న మధ్య తరహా కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేటు కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే అనుమతులు జారీ చేయాలి.
-గౌరీ సతీష్, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాల అసోసియేషన్ అధ్యక్షుడు


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed