బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై భారీగా పెరిగిన ఫిర్యాదులు

by Harish |
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై భారీగా పెరిగిన ఫిర్యాదులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లపై ఫిర్యాదులు భారీగా పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పథకంపై ఆర్‌బీఐ రూపొందించిన వార్షిక నివేదిక ప్రకారం, 2020 జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో ఫిర్యాదులు 58 శాతం పెరిగాయని, మొత్తం 3,08,630 ఫిర్యాదులు అందినట్టు ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు ఏడాది వచ్చిన మొత్తం ఫిర్యాదులు 1,95,901. సాధారణంగా జులై నుంచి జూన్ వరకు ఆర్థిక సంవత్సరంగా ఆర్‌బీఐ పాటిస్తోంది. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతం వరకు ఏటీఎం, డెబిట్ కార్డులకు సంబంధించి ఉండగా, మొబైల్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఫిర్యాదులు 13.38 శాతం ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, నోటీసులేమీ లేకుండా లెవీ ఛార్జీలను విధించడంపై ఫిర్యాదులు భారీగా పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

బ్యాంకులు…

2020, జూన్ నాటికి మొత్తం 3.08 లక్షల ఫిర్యాదులు రాగా, వాటిలో 48,333 ఫిర్యాదులు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐపై వచ్చాయి. తర్వాత 15,004తో హెచ్‌డీఎఫ్‌సీ ఉండగా, ఐసీఐసీఐ బ్యాంక్ 11,844, యాక్సిస్ బ్యాంక్ 10,457, పీఎన్‌బీ బ్యాంకుపై 9,928 ఫిర్యాదులను పరిష్కరించారు.

ఎన్‌బీఎఫ్‌సీలు..

ఆశ్చర్యకరంగా గతేడాది ఎన్‌బీఎఫ్‌సీలపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏకంగా 387 శాతం పెరిగాయి. 2019 జూన్‌తో ముగిసిన ఏడాదిలో 3,991 ఫిర్యాదులతో పోలిస్తే గతేడాది జూన్‌కి 19,432 ఫిర్యాదులు వచ్చాయి. ఎన్‌బీఎఫ్‌సీలపై వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 4,979 ఫిర్యాదులు రాగా, ఇండియాబుల్స్ కన్జ్యూమర్ ఫైనాన్స్‌పై 300 ఫిర్యాదులు, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై 252 ఫిర్యాదులు, టాటా కేపిటల్ ఫైనాన్స్‌పై 217 ఫిర్యాదులొచ్చాయి.

Advertisement

Next Story