రూ.300 కోట్లు ఇవ్వండి.. ZPTC పదవికి రాజీనామా చేస్తా..!

by Shyam |   ( Updated:2021-07-28 02:05:51.0  )
na-reddy-mohan-reddy
X

దిశ, కామారెడ్డి : రామారెడ్డి మండల అభివృద్ధికి రూ.300 కోట్ల నిధులు మంజూరు చేస్తే జడ్పీటీసీ పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రామారెడ్డి జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు నిధులు మంజూరు చేయించాలని సవాల్ విసిరారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గం, రామారెడ్డి మండల అభివృద్ధికి సంబంధించిన నిధులపై ప్రకటన విడుదల చేస్తూ.. ఆయన మాట్లాడారు. స్థానిక శాసనసభ్యులు జాజాల సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2000 కోట్లు, రామారెడ్డి మండల అభివృద్ధి కోసం రూ.300 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ యువతకు సర్కారు, ప్రైవేటు ఉద్యోగ కల్పన చేసి, యువతను వారి కాళ్ళపై నిలబడేలా కృషి చేయాలన్నారు. చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తూ, కౌలు రైతులకు కూడా ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీలపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందజేయాలని, ముఖ్యంగా మద్దతు ధరను వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల హామీలో ఇచ్చినట్టుగా రైతు రుణమాఫీ ఏకపక్షంలో మాఫీ చేయాలన్నారు. భూమి లేని ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు, అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అందించాలన్నారు. వీటన్నిటినీ నెరవేర్చి మండల అభివృద్ధికి నిధులు కేటాయిస్తే వెంటనే జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఉపఎన్నికల్లో కూడా తాను పోటీ చేయనని చెప్పారు. తన ప్రకటనకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగితే చాలన్నారు. జడ్పీటీసీ విడుదల చేసిన రాజీనామా ప్రకటన జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, దీనిపై ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed