సహాయక చర్యలు ముమ్మరం

by Shyam |   ( Updated:2020-10-14 06:40:10.0  )
సహాయక చర్యలు ముమ్మరం
X

దిశ చార్మినార్ : నగరంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరమంతా అతలాకుతలం అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. కుండపోతగా కురిసిన వర్షానికి ఇండ్లల్లోకి నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో వంట పాత్రలు, ఆహార ధాన్యాలతో పాటు ఇతర సామగ్రి నీళ్లల్లో మునిగిపోయింది. దాంతో కూడు, గూడు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవార్లు కురిసిన భారీ వర్షానికి ప్రజలు తలదాచుకునేందుకు మేడలపైకి ఎక్కారు. బండ్లగూడలో గోడకూలి సుమారు 9మంది మృతిచెందారు.

పాతబస్తీతో సహా నగరంలోని పలు మార్గాలన్నీ జలదిగ్బందం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు వైర్లు తెగిపోయి సగం నగరం రాత్రి చీకట్లోనే గడపాల్సి వచ్చింది. రోడ్లపై వాహనాలన్నీ కొట్టుకుపోయాయి. టోలీచౌకీ, మలక్ పేట, షాహీన్ నగర్, యాఖుత్ పురా, బాబానగర్ తదితర ప్రాంతాల్లో త్రాగడానికి నీరులేక, తిండి లేక అల్లాడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇరుక్కున్న వారిని కాపాడేందుకు జమా అతె ఇస్లామీ హింద్ కార్యకర్తలు రంగంలోకి దిగారు.

పునరావాస, సహాయక కార్యక్రమాల్లో జమా అతె ఇస్లామీ హింద్ హైదరాబాద్ నగర డిజాస్టర్ టీమ్ శక్తివంచన లేకుండా పాటుపడుతోందని నగర కార్యదర్శి ఆజమ్ అలీ బేగ్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు ఆహార ప్యాకెట్లను అందజేశామని ఆయన పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో బోట్ల ద్వారా ప్రజలను తమ కార్యకర్తలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆయన అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను తమ బృందంతో కలిసి జమాఅతె ఇస్లామీహింద్ నగర అధ్యక్షులు హాఫిజ్ రషాదుద్దీన్ సందర్శించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed