మంథని పంచాయితీపై గవర్నర్‌కు ఫిర్యాదు

by Anukaran |
మంథని పంచాయితీపై గవర్నర్‌కు ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథనిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వీరిమధ్య ప్రొటోకాల్ పంచాయితీ నడుస్తోంది. నేతల మధ్య ఉన్న విబేధాలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. ఈ వ్యవహారంపై శుక్రవారం కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మొన్నటి వరకు పోలీస్ స్టేషన్‌లో చనిపోయిన రంగయ్య మృతి కేసు విషయంపై హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు పరస్పర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రొటోకాల్ వివాదం రాజుకుంటోంది.

గో బ్యాక్ అంటూ నినాదాలు..

ఇటీవల భూపలపల్లి జిల్లా మల్హర్ మండలంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు హాజరయ్యారు. వేరే జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధి ఈ జిల్లాలో శంకుస్థాపనలు చేయడం ఏంటని పుట్ట మధు గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు మాత్రం మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి హోదాలో వచ్చాడని సమాదానం చెప్తున్నారు. చివరకు పుట్ట మధు కూడా కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి తయారైంది. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులను అక్కడి నుంచి పంపించారు. భూపాలపల్లి జిల్లాలో జరిగే కార్యక్రమాలకు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ అధికారికంగా ఎలా హాజరవుతారని మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ జడ్పీ మీటింగ్‌లోనే ప్రశ్నించారు. గురువారం మంథని నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కాగా, ఈ సమాచారం సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, కానీ ఎమ్మెల్సీలు తాటిపర్తి జీవన్ రెడ్డి, రఘోంత్తం రెడ్డిలకు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ శశిభూషన్ కాచె ఈ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియా హల్ చల్..

సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు చెంచాలు అంటూ టీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మంథని నియోజకవర్గంలో జరుగుతున్న వివాదాలే తరుచూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీధర్ బాబు అనుచరుడిగా ఎదిగిన పుట్ట మధుకు మధ్య విబేధాలు పెరిగాయి. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ చేరి, 2014 ఎన్నికల్లో శ్రీధర్ బాబునుపై గెలిచారు. ఇంతకాలం చాపకింద నీరులా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నప్పటికీ ఇప్పుడా గొడవలు రచ్చకెక్కాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించారన్న కోపంతో దాడులు జరగగా టీఆర్ఎస్ నాయకులే చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిత్యం ఏదో విషయంలో రాష్ట్ర స్థాయి చర్చకు వేదికగా మంథని మారుతుండడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed