- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వంపై ప్రైవేట్ ఆసుపత్రుల ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత రాకూడదనే సదుద్దేశంతో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను తప్పనిసరి చేస్తూ ఆరోగ్యశాఖ రెండు నెలల కిందట విడుదల చేసిన సర్క్యూలర్ పై ప్రైవేట్ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. అసలు ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడం తమ వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నాయి. లక్షల ఖర్చుతో కూడిన ప్లాంట్లను ఏర్పాటు చేయలేమని గగ్గోలు పెడుతున్నారు. ఒకవేళ ఏర్పాటు చేసినా వాటిని మెయింటెన్ చేయడం తమ వల్ల కాదని తేల్చిచెబుతున్నాయి. అంతేగాక ప్లాంట్ల కోసం వెచ్చించిన ఖర్చును ఏడాదిలోపు సమకూర్చుకోవడం సాధ్యం కాదంటున్నారు. ఇది తమతో పాటు పేషెంట్లకూ నష్టమేనని వివరిస్తున్నారు. దీంతో ఆక్సిజన్ ప్లాంట్లకు పెట్టిన ఖర్చు భారం రోగులపై కూడా పడే అవకాశం ఉన్నదని తానా(తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోం అసోసియేషన్ ) పేర్కొంటున్నది.
ఇదే విషయాన్ని గతంలో వైద్యారోగ్యశాఖకు లేఖ రూపంలో రాసినప్పటికీ, అధికారులు నుంచి స్పందన రాలేదని యూనియన్ నాయకుల్లో ఒకరు దిశకు చెప్పారు. అంతేగాక ప్రభుత్వం విధించిన సమయానికి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయలేదని రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 300 హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. అయితే నోటీసులిచ్చినప్పటికీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రైవేట్ యాజమాన్యాలు వ్యతిరేఖంగా ఉండటంతో పరిష్కారం వెతికే పనిలో సర్కార్ ఆలోచిస్తున్నది. ఏం చేస్తే ఆసుపత్రులకు నష్టం వాటిల్లకుండా ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాలను పరిశీలిస్తున్నది. దీనిపై నిపుణుల సలహాలు, సూచనలను కూడా తీసుకుంటున్నట్టు ఓ అధికారి తెలిపారు. అంతేగాక ఇతర దేశాలు, రాష్ర్టాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల అమలు, పనితీరు, సక్సెస్ రేట్ వంటి అంశాలను కూడా అన్వేషిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
ఒక్కో ప్లాంట్ కు రూ. కోటి..
ఆగస్టు చివరి కల్లా 100 నుంచి 200 బెడ్ల వరకు ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు కచ్చితంగా ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పుకోవలసిందేనని వైద్యారోగ్యశాఖ జూలై 24వ తేదిన తేల్చి చెప్పింది. 200 బెడ్ల వరకు ఉన్న హాస్పిటల్స్ 500 ఎల్ పిఎం( లిటర్ ఫర్ మినిట్), 500 బెడ్ల వరకు ఉన్నవి 1000 ఎల్ పిఎం, 500కు పై బడి బెడ్లు ఉన్న హాస్పిటల్స్ 2000 ఎల్ పిఎం కేపాసిటీతో ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయితే వాటి ఏర్పాటుకు సుమారు 50 లక్షల నుంచి కోటి రూపాయాలు ఖర్చు అవుతున్నదని తానా పేర్కొన్నది. దీనికి అదనంగా ప్రతీ ఏటా పది శాతం అదనంగా నిర్వహణ ఖర్చు అవుతుందన్నది. అంతేగాక దీనికి టెక్నాలజీతో పాటు టెక్నికల్ సమస్యలు రాకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించుకోవాల్సి వస్తుందన్నది. కానీ ఆ స్థాయిలో పేషెంట్లు ఆసుపత్రులకు వచ్చే అవకాశమే లేదని తానా స్పష్టం చేసింది.
పైగా కొవిడ్ తో పాటు నాన్ కొవిడ్ హాస్పిటల్స్ లో కూడా ఏర్పాటు చేసుకోవాలనడం ఎంత వరకు సబబని తానా నాయకులు ప్రశ్నించారు. ఇప్పటికే 200 బెడ్ లకు సరిపోయే సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ పైపులైన్ సిస్టం, పెద్ద కెపాసిటీ సిలిండర్లు ఉన్నా మళ్లీ ఆక్సిజన్ జనరేటర్లను పెట్టుకోవాల్సిన అవసరం ఏముందో అర్ధం కావడం లేదని తానా మండిపడుతున్నది. కానీ ప్రజారోగ్య శాఖ మాత్రం ఖచ్చితంగా ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పు వలసిందేనని, సెకండ్ వేవ్ సందర్భంలో వచ్చిన ఆక్సిజన్ కొరత పునరావృతం కాకుండా ఉండాలంటే సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లను పెట్టుకోవాల్సిందే స్పష్టం చేసినట్టు వివరించారు.
కేంద్రం ఇచ్చేందుకు రెడీగా ఉన్నా..
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల అనుభవ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు అన్ని రాష్ర్టాలకు సుమారు రూ.250 కోట్లను ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నదని తానా నాయకుల్లో ఒకరు చెప్పారు. ఆ నిధులతో ఉమ్మడి జిల్లాల వారీగా ప్లాంట్లను నెలకొల్పవచ్చునని పేర్కొన్నారు. కానీ రాష్ర్ట ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా, ప్రైవేట్ ఆసుపత్రులపై అదనపు భారం రుద్దడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు గుదిబండే
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు తప్పనిసరి నిర్ణయం మాపై గుదిబండగా మారుతున్నది. తద్వారా పేషెంట్లపై కూడా ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది. అంతేగాక కొన్ని ఆసుపత్రులు రెసిడెన్సీ, సొంత ఇళ్లల్లో ఉంటాయి. అలాంటి వాటిలో ఆక్సిజన్ ప్లాంట్లను ఎలా ఏర్పాటు చేయాలి?. సెకండ్ వేవ్ తీవ్రత థర్డ్ వేవ్‌లో ఉండదంటున్నారు. కానీ అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏం అవసరం? పైగా నాన్ కొవిడ్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ కూడా నోటీసులు ఇవ్వడం దారుణం. వైద్యారోగ్యశాఖ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.
-డాక్టర్ రాకేష్, తానా ప్రెసిడెంట్