ఆక్సిజన్ ప్రొడక్షన్ పెంచండి

by Shamantha N |
ఆక్సిజన్ ప్రొడక్షన్ పెంచండి
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో కరోనా పేషెంట్ల తాకిడి పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నతాధికారులకు సూచించారు. ఆక్సిజన్ సరఫరా నిరాటంకంగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యధిక కేసులతో సతమతమవుతున్న 12 రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలను ఆయన శుక్రవారం సమీక్షించారు. అన్ని రాష్ట్రాలకు సరిపడా ఆక్సిజన్ సిలిండర్ల సప్లై చేయడంపై చర్చించారు. ఆరోగ్య శాఖ, స్టీల్, రోడ్డు రవాణా సహా పలు శాఖల అధికారుల నుంచి అవసరమైన వివరాలను తీసుకున్నారు.

అన్ని శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతిప్లాంట్ దాని సామర్థ్యానికి తగినంతగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని అన్నారు. ఆక్సిజన్ సప్లై చేసే ట్యాంకర్‌లు దేశవ్యాప్తంగా నిరాటంకంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రైవర్లూ షిఫ్టులుగా డ్రైవ్ చేస్తూ రవాణా వేగవంతం చేయాలని వివరించారు. స్టీల్ ప్లాంట్‌లలోని అదనపు నిల్వలను మెడికల్ అవసరాలకు వినియోగించుకోనున్నట్టు అధికారులు ప్రధానికి వివరించారు. ఆక్సిజన్ సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్‌లు 24 గంటలు పనిచేయడానికి అనుమతినిస్తామని తెలిపారు. ఇండస్ట్రియల్ సిలిండర్లను మెడికల్ ఆక్సిజన్ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని వినియోగించుకోనున్నట్టు చెప్పారు. ఆక్సిజన్ సప్లై ట్యాంకర్‌ల కొరతను దృష్టిలో పెట్టుకుని నైట్రోజన్, ఆర్గాన్ ట్యాంకర్లనూ ఆక్సిజన్ ట్యాంకర్లుగా మార్చుతామని పేర్కొన్నారు. ట్యాంకర్ డ్రైవర్‌లు షిఫ్టులుగా డ్రైవింగ్ చేస్తూ వేగంగా సరఫరా చేసేలా సూచనలు జారీ చేస్తామని వివరించారు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్తాన్‌లలో కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో ఆక్సిజన్ సప్లైలు, రానున్న 15 రోజుల్లో డిమాండ్‌ వివరాలను ప్రధానికి వివరించారు. ఆక్సిజన్ సప్లై, డిమాండ్‌లపై ఈ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ టచ్‌లోనే ఉన్నదని, అవసరానికి అనుగుణంగా కేంద్రం కేటాయింపులు చేస్తున్నదని వివరించారు.

Advertisement

Next Story