ఇరకాటంలో ఈటల.. రాజకీయ ఎదుగుదులపై ప్రభావం!

by GSrikanth |   ( Updated:2022-08-20 04:09:58.0  )
ఇరకాటంలో ఈటల.. రాజకీయ ఎదుగుదులపై ప్రభావం!
X

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్​నగర మాజీ మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ జయంతికి హాజరైన ఈటల రాజేందర్‌ను అభిమానులు కాబోయే సీఎం అంటూ నినాదాలు చేయడం ఇబ్బందికరంగా మారింది. గతంలోనూ ఇలాంటి నినాదాలు వినిపించడంతో బీజేపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అది రిపీట్ అయింది. అభిమానుల అత్యుత్సాహం ఈటల మెడకు చుట్టుకున్నది. ఇది పార్టీలో ఆయనకు భవిష్యత్ లో లభించే ప్రాధాన్యతకు సంకటంగా మారే అవకాశం ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికతో బీజేపీ హైకమాండ్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్న ఈటలకు ఇటీవలి కాలంలో కష్టాలు మొదలయ్యాయి. కాబోయే సీఎం ఆయనేనని, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌తో సమానంగా పార్టీలో ప్రాధాన్యం లభిస్తున్నదని ఈటల అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదే ఆయనకు గుదిబండగా మారింది. గతంలో ఓసారి కాబోయే సీఎం అంటూ నినాదాలు రావడంతో బీజేపీ హైకమాండ్ ఒకింత సీరియస్ అయింది. తొందరపడి ఇలాంటి నినాదాలు వద్దంటూ అభిమానులకు సర్దిచెప్పుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) మొదటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా బోయగూడలోని ముదిరాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుల సంఘానికి చెందిన కార్యకర్తలు కాబోయే సీఎం ఈటల అంటూ నినాదాలు చేశారు.

ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ పుట్టినరోజు కావడంతో ఆయనకు ఈటల శుభాకాంక్షలు తెలిపారు. వారు కొద్దిసేపు ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ భేటీ పూర్తికాగానే కార్యకర్తలు ఒక్కసారిగా కాబోయే సీఎం.. ఈటల అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో ఈటల జోక్యం చేసుకుని.. ఎవరికి ఏ పదవి, పోస్టు ఇవ్వాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, ఇలాంటి నినాదాలు తగదంటూ నచ్చచెప్పారు. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో వీరిద్దరిలో సీఎం పదవి ఎవరికి దక్కుతుందనేది ఈటల అభిమానుల్లో మాత్రమే కాక పార్టీ శ్రేణుల్లో అప్పట్లో చర్చనీయాంశమైంది. సీఎం ఎవరు కాబోతున్నారనే అంశం అప్రస్తుతమే అయినా ఈటల పేరు తెరపైకి రావడంతో హైకమాండ్ అప్పట్లోనే సీరియస్ అయింది. ఇప్పుడు మరోసారి అది రిపీట్ కావడంతో అభిమానుల అత్యుత్సాహం ఈటల మెడకు చుట్టుకున్నది. రానున్న కాలంలో ఆయనకు పార్టీలో లభించే ప్రాధాన్యతకు సంకటంగా మారింది.

ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి లీడర్లను, శ్రేణులను ఆకర్షించేందుకు ఏకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసిన పార్టీ హైకమాండ్ ఆ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పజెప్పింది. పార్టీలోని రాష్ట్రస్థాయి నేతలతోనూ సంబంధం లేకుండా, సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా చేర్చుకుంటున్నారని ఇటీవల ఈటలపై విమర్శలు వచ్చాయి. పార్టీలోకి చేర్చుకునేవారి నేర చరిత్ర తదితరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో చెడ్డపేరు వస్తుందనే ఆరోపణలూ వినిపించాయి. ఇప్పటికే ఇలాంటి నిందలను ఎదుర్కొంటున్న ఈటలకు అభిమానుల ఓవర్ యాక్షన్‌తో తలనొప్పి మొదలైంది. ఈటల రాజేందర్‌కే తమ మద్దతు అంటూ ముదిరాజ్ సంఘ కార్యకర్తలు నినదించడం కూడా వివాదాస్పదమైంది. కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీలోకి ఈటల ఆహ్వానించినట్లు గుసగుసలు మొదలయ్యాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :

మునుగోడు సభకు హైదరాబాద్ జనం.. 2 వేల కార్లతో భారీ కాన్వాయ్

Advertisement

Next Story