బీజేపీకి సినీ నటి గౌతమి రాజీనామా

by GSrikanth |   ( Updated:2023-10-23 06:17:25.0  )
బీజేపీకి సినీ నటి గౌతమి రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: పండగ పూట బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సినీ నటి గౌతమి తాడిమళ్ల సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన రిజైన్ లెటర్‌ను పోస్ట్ చేశారు. ఈ లెటర్ రాజకీయ తమిళ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 'బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని బరువెక్కిన హృదయంతో, తీవ్ర నిరాశతో నిర్ణయం తీసుకున్నాను. దేశ నిర్మాణానికి నా ప్రయత్నాలకు సహకరించేందుకు 25 ఏళ్ల క్రితం పార్టీలో చేరాను. పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం లభించలేదు. పైగా ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన అళగప్పన్ అనే వ్యక్తికి సొంత పార్టీ నాయకులే అండగా నిలుస్తున్నారు.

2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. తాను తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన అనాథను మాత్రమే కాదు, శిశువుతో ఒంటరి తల్లిని కూడా. ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుందని నేను ఊహించలేదు. అందువల్లే ఆవేదనతో పార్టీని వీడుతున్నాను’ అంటూ రిజైన్ లెటర్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామళైకి పంపించారు.





Advertisement

Next Story