Delhi Assembly: ఢిల్లీ రేసులో ఉన్న బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు అంటే?

by D.Reddy |
Delhi Assembly: ఢిల్లీ రేసులో ఉన్న బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు అంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) భారతీయ జనతా పార్టీ (BJP) 27 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత తమ జెండాను ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి అగ్ర స్థానంలో నిలవటం విశేషం. అలాగే ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి (BJP) దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు కూడా లభించడంతో కమలం గెలుపు సులభమైంది. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతోన్న బీజేపీ.. ఢిల్లీ పగ్గాలను ఎవరికిస్తుందనేదే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే, ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను (Ex CM Aravind Kejriwal) ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ (Parvesh Sahib Sing Varma) పేరు ఢిల్లీ సీఎం రేసులో (Delhi CM race) ప్రధానంగా వినిపిస్తోంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటి చేసిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ.. మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌‌పై ఘన విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ (Sahib Sing Varma) కుమారుడైన పర్వేష్ వర్మ.. తొలిసారిగా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై మెహ్రౌలి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యోగానంద్ శాస్త్రిని ఓడించారు. ఆ తర్వాత 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు.

2019లో కూడా పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటి చేసి తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలో ఓ లోక్‌సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన వర్మ, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అని పిలవటంతో ఎన్నికల సంఘం ఆయనపై 24 గంటల పాటు నిషేధం విధించింది. ఇక పర్వేష్ వర్మ పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుల జీతభత్యాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్ వర్మ.. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో తలపడ్డారు. ఈ ఎన్నికలకు ముందు, పర్వేశ్ వర్మ 'రిమూవ్ కేజ్రీవాల్, సేవ్ ది నేషన్' అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది బాగా పని చేసింది.

దేశ రాజధానిలోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పర్వేష్ వర్మ మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 1977 నవంబర్ 7న జన్మించిన ఈయన.. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కాలేజీలో చేరారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పొందారు. 2013లో రాజకీయ కేరీర్‌ను ప్రారంభించారు.

Next Story