పవన్ కల్యాణ్‌తో పొత్తు, ఎన్టీఆర్‌తో ప్రచారం.. అంతుచిక్కని బీజేపీ వ్యూహం?

by GSrikanth |   ( Updated:2022-09-05 02:03:08.0  )
పవన్ కల్యాణ్‌తో పొత్తు, ఎన్టీఆర్‌తో ప్రచారం.. అంతుచిక్కని బీజేపీ వ్యూహం?
X

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ చర్చ బీజేపీలో తెర మీదకు వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ మధ్య సమావేశంపై ఆయన స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పారు. భవిష్యత్‌లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను పార్టీ ప్రచారం కోసం వినియోగించుకుంటామని సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ సేవలను తెలంగాణలో, ఏపీలో ఎక్కడ వినియోగించుకుంటారని ప్రశ్నించగా ఆయనకు ప్రజాదరణ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే వాడుకుంటామని పేర్కొన్నారు. పరోక్షంగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుంటామని సోము స్పష్టం చేసినట్లయింది. ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీతో మా వైఖరిలో మార్పులేదు : సోము వీర్రాజు

''చంద్రబాబుతో మా వైఖరిలో మార్పు లేదు. కుటుంబ పార్టీలకు మా పార్టీ దూరంగానే ఉంటుంది. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేసింది. ఇక జనసేనతో మా పొత్తు ఉంటుందని చెబుతూ పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేయటం ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి కారణమవుతున్నది. మేము, పవన్ కళ్యాణ్‌తో కలిసే ఉన్నాం.''

రాజకీయాలు అందరూ చేస్తారు : రాష్ట్ర బీజేపీ

రాజకీయాలు కొంత మందే కాదు.. అందరూ చేస్తారని సోము వీర్రాజు కీలక వ్యాఖ్య చేశారు. తద్వారా కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పొత్తుల్లో భాగంగా టీడీపీతో కలవాలనే విధంగా చేస్తున్న ప్రకటనలు ప్రయత్నాలపైనే సోము వీర్రాజు ఈ విధంగా రియాక్ట్ అయినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపీ భావిస్తున్నదని, పవన్ కళ్యాణ్ తిరిగి టీడీపీతో పొత్తు దిశగా ప్రకటన చేస్తే అప్పుడు అధికారికంగా స్పందిస్తామని కమలం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదే సమయంలో సోము వీర్రాజు యాక్టర్లు కానివారు ఎవరని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ యాక్టర్లే అనేలా వ్యాఖ్యానించారా? లేక ఇతర రాజకీయ పార్టీలను ఉద్దేశించి అన్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సోము వీర్రాజు వ్యాఖ్యలతో అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ ప్రచారం కోసం ఆహ్వానించారా!.. జూనియర్ ఎన్టీఆర్ అందుకు సిద్ధమేనా అనే మరో చర్చ మొదలైందని తెలుస్తున్నది.

ఎన్టీఆర్ మౌనం

బీజేపీ ఎంపీలు జీవీఎల్ నర్సింహారావు, తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ సైతం అమిత్ షా, జూ.ఎన్టీఆర్ మధ్య రాజకీయంగా చర్చ జరిగిందని వెల్లడించారు. మాజీ మంత్రి కొడాలి నాని సైతం జూనియర్ సేవలను బీజేపీ దక్షణాది రాష్ట్రాల్లో ప్రచారం కోసం వినియోగించుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు తాము జూనియర్ ఎన్టీఆర్ సేవలు వినియోగించుకుంటామని చెప్పటం ద్వారా పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరం. ఈ వ్యాఖ్యలపై తారక్ ఇప్పటికైనా స్పందిస్తారా లేక మరికొంతకాలం వేచిఉంటారా? అన్నది చూడాలి. గతంలో చాలాసార్లు తనలో ప్రవహిస్తున్నది తెలుగుదేశం రక్తమే చెప్పారు. దీంతో బీజేపీకి ఏ మేరకు సహకరిస్తారన్నది ఇప్పుడు రాజకీయ పార్టీల్లో చర్చను లేపింది.

జనసేనానితో పొత్తు కొనసాగాల్సిందేనంటున్న కాషాయ శ్రేణులు

అభిమానుల్లోనే కాకుండా సామాన్య జనాల్లోనూ తిరుగులేని క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్‌తో పొత్తును కొనసాగించాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు లాంటి కొన్ని సమస్యలపై బీజేపీ నుంచి స్పష్టత కోరుతున్నారు. పైకి చెప్పకపోయినా జనసేన, బీజేపీల మధ్య కొంత ప్రతిష్టంభన నెలకొందని విశ్లేషకులు అంటున్నారు. రానున్న రోజుల్లో ఇవి సర్దుకుంటాయని కూడా రెండు పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. ఇటు జనసేనతో పొత్తు కొనసాగిస్తూనే మరింత బలపడేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, అందుకే రానున్న ఎన్నికల్లో తాము పోటీ చేసే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి మరో క్రేజ్ ఉన్న స్టార్‌తో ప్రచారం చేయించాలన్నది బీజేపీ ఉద్దేశంగా కనపడుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి కమలనాథుల ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి

ఎన్టీఆర్ సేవలను పార్టీకి వినియోగించుకుంటాం.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

వాళ్లను అడ్డుకుంటే స్వయంగా నేనే రోడ్డెక్కుతా: Pawan Kalyan

Advertisement

Next Story

Most Viewed