AP Politics: ఏం చేయాలబ్బా.. వైసీపీ నేతల్లో పెరుగుతున్న అసహన స్వరం

by Indraja |
AP Politics: ఏం చేయాలబ్బా.. వైసీపీ నేతల్లో పెరుగుతున్న అసహన స్వరం
X

దిశ, ఏపీ బ్యూరో: పగోళ్లక్కూడా ఇలాంటి కష్టం రాకూడదన్నట్లుంది మాజీ సీఎం జగన్ పరిస్థితి. ఎన్డీయే కూటమిలోని బీజేపీ పెద్దలకు వ్యతిరేకం కాకూడదు. కాంగ్రెస్‌కు దగ్గర అవకూడదు. పోనీ ఇలాగే కాలం నెట్టుకెళ్తే.. ఐదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎదో ఒకవైపు జంప్ అయితే ఎలా ఉంటుందని వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవడం ఇప్పుడు జగన్‌కు పెద్ద టాస్కే అంటున్నారు విశ్లేషకులు. చేసిన తప్పులపై ఆత్మ విమర్శతో అంగీకరించడం.. ఏదో పేరుతో నిరంతరం ప్రజల్లో ఉంటే కొంతమేర పార్టీని నిలబెట్టుకోవచ్చని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పథకాలు అందించినా ఘోర పరాజయం

ఐదేళ్లపాటు నిజాయతీగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా ఇంత దారుణ ఓటమిని ఎందుకు చవిచూడాల్సి వచ్చిందని వైసీపీ నేతలు వాపోతున్నారు. కొందరు నేతలైతే జగన్ విధ్వంసం, నియంతృత్వ పోకడలే కారణమంటున్నారు. పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకపోవడమే ప్రధాన లోపంగా మరికొందరు నాయకులు విశ్లేషిస్తున్నారు. సీఎంగా జగన్ ప్రజలను, పార్టీ యంత్రాంగాన్ని దూరం పెట్టినందునే ఈ దుస్థితి దాపురించిందని ఇంకొందరు నేతలు చెబుతున్నారు. సగటు ప్రజలపై అలవికాని భారాలు మోపుతూ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని చాలా మంది నేతల అభిప్రాయం. పథకాల పేరుతో ప్రజలపై వలంటీర్లతో పెద్ద ఎత్తున నిఘా పెట్టడాన్ని జనం సహించలేకపోయినట్లు పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మాతృ పార్టీలోకి నేతలు జంప్?

పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ పనైపోయింది కాబట్టి మాతృ సంస్థ కాంగ్రెస్‌‌లోకి రావాలని ఆ పార్టీ నేతలకు పరోక్షంగా ఆహ్వానం పలికారు. దీంతో వైసీపీలో ప్రాధాన్యం దక్కని సీనియర్​ నేతలు ఆలోచనలో పడినట్లు సమాచారం. మరో ఐదేళ్లలో వైసీపీ పుంజుకుంటుందో లేదోనన్న అనుమానం పలువురు నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎక్కువ మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది.

డబుల్ గేమ్ నుంచి బయటపడేదెలా?

ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్​కొంత సందిగ్ధంలో పడ్డారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దూరం కాలేని పరిస్థితి. రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఇక్కడ వ్యతిరేకంగా అక్కడ అనుకూలంగా వ్యవహరించడం వల్ల పార్టీని గందరగోళంలోకి నెడుతుంది. దీన్నుంచి ఎలా బయటపడాలన్నదే మిలియన్​డాలర్ల ప్రశ్న. ఇప్పటిదాకా బీజేపీ రెండు కళ్ల వ్యవహారంలో జగన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంటే ఏదో ఒకవైపు నిలుస్తారా? లేక అదే డబుల్ గేమ్‌తో నెట్టుకొస్తారా? అనేది వైసీపీ భవితవ్యాన్ని నిర్దేశిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed