- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా బండ్లకు భరోసా ఏది?
• లబోదిబోమంటున్న బైక్ ఓనర్లు
• లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు పెడుతున్న పోలీసులు
• కోర్టుకు వెళ్ళి విడిపించుకోవాల్సిందే
దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్‌తో ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వం వీలైనన్ని మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జించాలని చూస్తోంది. దానికి లాక్‌డౌన్ ఉల్లంఘనలను పకడ్బందీగా వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఆ వాహనంపై పెండింగ్‌లో ఉన్న చలాన్ల డబ్బుల్ని కూడా వసూలు చేస్తున్నారు. వాటిని కట్టిన తర్వాతే బండి చేతికి వస్తుందనుకునేవారికి నిరాశే ఎదురవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుమీదకు వచ్చినందుకు కేసు పెట్టి బండిని సీజ్ చేశామని తాపీగా చెప్తున్నారు. అయితే అలా సీజ్ చేసిన బండికి సంబంధించి చాలా చోట్ల పోలీసులు రసీదు ఇవ్వడంలేదు. ఈ బండిని కోర్టులో హాజరుపరుస్తామని, అక్కడికి వెళ్ళి ఫైన్ కట్టి తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ బండి భద్రంగా ఉంటుందా, ఒకవేళ మిస్సయితే దానికి జవాబుదారీ ఎవరు అనేది ఇప్పుడు బైక్ ఓనర్లను వేధిస్తున్న ప్రశ్న.
లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిత్యావసరాలు, అత్యవసరాలకు మాత్రమే రోడ్లమీదకు రావడానికి అనుమతి ఉంది. నిర్దిష్ట కారణాలు లేకుండా రోడ్డెక్కితే పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారని ప్రభుత్వమే స్పష్టం చేసింది. కార్లు, బైక్‌లు వాడేవారు నివాసం నుంచి మూడు కి.మీ. పరిధిలో మాత్రమే తిరగాలని, అది దాటి వస్తే నిఘా నేత్రంలో చిక్కుకోక తప్పదని పోలీసులు హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా పోలీసులు నగరంలోని ప్రధాన రోడ్లపైన చెక్‌పోస్టులు పెట్టారు. అక్కడ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ నిర్దిష్ట కారణం లేకుండా రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆ బైక్‌ను, దానిపైన వచ్చినవారి ఫోటోలను మొబైల్ లేదా కెమెరాలో తీసుకుంటున్నారు. అంటువ్యాధుల చట్టం, విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలకు లోబడి ఐపీసీలోని 188 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాన్ని పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు.
ఇలా సీజ్ చేసిన వాహనాల వివరాలను, నమోదు చేసిన కేసులను లాక్‌డౌన్ అనంతరం పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. ఆ వాహనాల యజమానులు కోర్టుకు వెళ్ళి తగిన జరిమానా కట్టి కోర్టు తీర్పు మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే రోడ్లమీద వాహనాలను సీజ్ చేసిన తర్వాత పోలీసులు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ఆధారం లేకుంటే.. ఒకవేళ సదరు బైక్ కనిపించకుండా పోతే ఏ పోలీసును అడగాలనేది పెద్ద సందేహం. కనిపించకుండాపోయిన వాహనానికి ఏ పోలీసు జవాబుదారీ అనేది కూడా ప్రధానాంశంగా ముందుకొచ్చింది. అత్యవసర పనిమీద రోడ్డుమీదకు వచ్చినా సరే పోలీసులు వాహనాన్ని సీజ్ చేయడం ద్వారా చాలా పనులు ఆగిపోతున్నాయని వాపోయేవారూ ఉన్నారు. పెండింగ్ చలాన్లన్నింటినీ కట్టిన తర్వాత బతికి బయటపడ్డాం అనుకునేలోపే బైక్‌ను సీజ్ చేయడంతో లాక్‌డౌన్ ముగిసేంతవరకూ ఇబ్బందులు పడుతున్నామని మొత్తుకుంటున్నారు.
దీనిపై ఒక పోలీసు అధికారిని వివరణ కోరగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంటుందని, ఇప్పుడు లాక్‌డౌన్ పరిస్థితుల్లో సివిల్ పోలీసులే అంటువ్యాధుల చట్టం, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఏదైనా వాహనాన్ని సీజ్ చేసినప్పుడు విధిగా ఆ వాహన యజమానులకు తగిన రసీదు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే రకరకాల కారణాలతో అది సరిగ్గా అమలు జరిగి ఉండకపోవచ్చునని వివరించారు. కానీ వాహనాలు మిస్ అయ్యే అవకాశంలేదని, కానీ యజమానుల్లో ఆ సందేహం రావడం సహజమేనని అన్నారు. వాహనాన్ని సీజ్ చేసే సమయంలో పెట్టీ కేసు నమోదు చేయగానే యజమాని మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వెళ్తుందని, దాన్నిబట్టి ఆ వాహనం ఎక్కడ ఉందో, ఎవరిని సంప్రదించాలో తెలిసిపోతుందన్నారు.
ఏదేమైనా లాక్‌డౌన్ కాలాన్ని కూడా ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది. ఒకవైపు పెండింగ్‌లో ఉన్న చలాన్ల మొత్తాన్ని వసూలు చేయడంతో పాటు ఇప్పుడు లాక్‌డౌన్ ఉల్లంఘనల పేరుతో కేసులు పెట్టి జరిమానా వసూలు చేసుకుంటోంది. తాజాగా మాస్కు లేకుంటే పట్టుకున్న ప్రతీసారి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించే నిబంధన కూడా అమల్లోకి రావడంతో వీలున్న చోటల్లా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.
Tags: Telangana, Corona, LockDown, Police, Seizing of vehicle, Pending Challans, Checkposts