వైట్ రేషన్ కార్డు లేని పేదలకు 25 కిలోల బియ్యం పంపిణీ

by Shyam |
వైట్ రేషన్ కార్డు లేని పేదలకు 25 కిలోల బియ్యం పంపిణీ
X

దిశ, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో వైట్ రేషన్ కార్డు లేని పేదలను గుర్తించి వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. గురువారం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద స్పీకర్ పోచారం పేదలకు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మొదటగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారిలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఉచితంగా అందించిందన్నారు. వారికి ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ఉపాధి లేక పేదలు, కూలీల కుటుంబాలకు పూట గడువడమే కష్టంగా ఉందన్నారు. గత కొంతకాలంగా వైట్ రేషన్ కార్డు కోసం ధరఖాస్థు చేసుకుని, ఇంకా కార్డు రాని వారికి కూడా అండగా ఉంటామన్నారు. నియోజకవర్గ పరిధిలోని 126 గ్రామ పంచాయతీల పరిధి 230 గ్రామాల్లో ఎక్కడ పేదప్రజలున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు గుర్తించి పోచారం ట్రస్ట్ ద్వారా అందించే బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఆకలితో ఎవరూ బాధ పడకుండా చూడాలని అధికారులను కోరారు. కరోనా వ్యాప్తికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగిలో 40 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారన్నారు. ఈ ధాన్యాన్ని మద్దతు ధర ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పోచారం రైతులకు భరోసా నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 6900 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులు తొందరపడి ప్రైవేటు వ్యాపారుల చేతిలో మోసపోకుండా తమ ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వానికి అమ్ముకోవాలని స్పీకర్ రైతులకు సూచించారు.

Tags: carona, lockdown, pocharam trust, 25kgsn rice distributi0n, poor people

Advertisement

Next Story

Most Viewed