గుంజీలు తీస్తారా..? మోడీకి దీదీ సవాల్

by Shamantha N |
గుంజీలు తీస్తారా..? మోడీకి దీదీ సవాల్
X

కోల్‌కతా : ఒకరోజు నిషేధం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ ఎన్నికల ప్రచారంలో దూకారు. ఎప్పటిలాగే ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఆయన ఓ అబద్దాల కోరు అని విమర్శించారు. బెంగాల్ ప్రజలకు తాను ఏం చేయలేదని మోడీ అంటున్నారని, కానీ తాను చేసింది నిరూపిస్తే ఆయన గుంజీలు తీస్తారా..? అని సవాల్ విసిరారు. కోల్‌కతాకు సమీపాన ఉన్న బరసత్ లో మంగళవారం రాత్రి జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘మతువా కమ్యూనిటీకి నేను ఏం చేయలేదని మోడీ అంటున్నారు. సరే.. నేను సవాల్‌ను స్వీకరిస్తున్నాను. ఒకవేళ నేను వారికి (మతువాలకు) ఏం చేయలేదని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు (మోడీ) చెప్పేది అబద్దమని రుజువైతే చెవులు పట్టుకుని గుంజీలు తీస్తారా…?’ అని సవాల్ విసిరారు. పోలింగ్ జరిగే తేదీలలో ప్రధాని ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడాన్ని దీదీ తప్పుబట్టారు. ఎన్నికల కమిషన్ దీని మీద ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. మోడీ ఒక అబద్దాల కోరు అని విమర్శించారు. ‘మోడీ లయర్ (అబద్దాలాడేవాడు).. ప్రధాని అబద్దాలాడతాడు..’ అని వ్యాఖ్యానించి మళ్లీ.. ‘లయర్ అనేది సరైన పదం కాదు. అది అన్‌పార్లమెంటరీ వర్డ్. ఆయన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నార’ని దీదీ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story