కరోనాతో జైలులో ఆందోళన.. 9 మంది మృతి

by vinod kumar |
కరోనాతో జైలులో ఆందోళన.. 9 మంది మృతి
X

లిమా : పెరూ రాజధాని లిమాలోని ఒక జైలులో కరోనా కలకలం సృష్టించింది. జైలులోని పదిహేను మంది ఖైదీలు కోవిడ్-19తో చనిపోవడంతో మిగిలిన ఖైదీలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను అదుపు చేసే క్రమంలో జైలు అధికారులు చేపట్టిన చర్యలు కాస్తా హింసాత్మకంగా మారడంతో 9 మంది మృతి చెందారు. ఖైదీలు చేసిన దాడిలో పదుల సంఖ్యలో జైలు అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. పెరూలోని క్యాస్ట్రో-క్యాస్ట్రో జైలులో సోమవారం హింస చెలరేగింది. జైలులో ఉన్న ఖైదీలలో 600 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కిక్కిరిసి పోయిన ఈ జైలులో కోవిడ్-19 మరణాలు పెరిగిపోవడంతో ఖైదీలు ఆందోళనకు దిగారు. చాలా మంది ఖైదీలు జైలు గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. మరి కొంత మంది సిబ్బంది వద్ద నుంచి ఆయుధాలు లాక్కొనేందుకు సిద్దపడ్డారు. జైలులోని సామాగ్రితో పాటు మంచాలు, ఇతర ఫర్నిచర్ తగులబెట్టారు. ఆ సమయంలో జైలులో ఉన్న 60 మంది సిబ్బంది, ఐదుగురు పోలీసులు, ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. ఈ ఘర్షణలో 9 మంది ఖైదీలు చనిపోయారు. కాగా, తమను విడుదల చేయాలని ఖైదీలు తొలుత ధర్నాకు దిగారని.. కాని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకపోవడంతో జైలు సిబ్బంది వారిని నిరసన విరమించమని కోరారు. అయితే తమకు కరోనా నుంచి ముప్పుందని గ్రహించిన ఖైదీలు ఎలాగైనా అక్కడి నుంచి పారిపోయేందుకు హింసకు పాల్పడ్డారు. దీనిని సిబ్బంది అదుపులోనికి తీసుకొని వచ్చారు. ఖైదీలతో జైలు సిబ్బంది ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖైదీలకు మెరుగైన చికిత్స అందించడమే కాకుండా.. వారికి సరైన ఆహారం ఇస్తామని చెప్పినట్లు జైలు అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. కాగా, జైలులోని ఖైదీల ఆందోళనకు మద్దతుగా జైలు వెలుపలు వారి బంధువులు, సన్నిహితులు నిరసన కార్యక్రమాలకు దిగారు. కరోనా బారి నుంచి వారిని రక్షించడానికి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags : Peru, Lima, Castro Castro, Jail, Riot, Prison, Inmates, Coronavirus, Covid-19

Advertisement

Next Story

Most Viewed