ఆదేశాలు బేఖాతర్.. యథావిధిగా వారపు సంతలు

by Shyam |
ఆదేశాలు బేఖాతర్.. యథావిధిగా వారపు సంతలు
X

దిశ,తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం కావడంతో సంతలు నిర్వహించవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం రైతు మార్కెట్లలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఆ ఆదేశాలకు తిలోదకాలిస్తూ వారపు సంతలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలంతా భారీగా తరలిరావడంతో మార్కెట్లు జనసందోహంగా మారుతున్నాయి. అవి కరోనా వ్యాప్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారే ప్రమాదం ఉంది.

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా ప్రభుత్వం మొదటగా నైట్ కర్ప్యూ విధించింది. సభలు, సమావేశాలు, శుభకార్యాయాలకు షరతులతో కూడిన అనుమతితో పాటు సంతలు నిర్వహించొద్దని ఆదేశించింది. అయినా కరోనా అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటలు వెసులు బాటు కల్పించింది. నిత్యావసరాల కొనుగోలుకు, ఇతరాత్ర అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయినా వ్యాపారులు మాత్రం వారపు సంతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నగరంలోని ప్రతీ డివిజన్‌లో ఏదో ఓ కాలనీలో ప్రతీ రోజు సంత జరుగుతూనే ఉంది. ప్రజలంతా ఒక్కసారిగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. ప్రజలు ఎక్కడా కూడా భౌతిక దూరం పాటించిన దాఖలాలు లేవు.

కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, గాజుల రామారం, గడ్డి అన్నారం మార్కెట్, ఎర్రగడ్డ, బోయినపల్లి, మాదన్నపేట్ వంటి ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో భయాందోళనకు గురైన వ్యాపారులు తక్కువ షాపులను తెరిచారు. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం.. నాలుగు గంటలు వేసులుబాటు కల్పించడంతో అందరూ దుకాణాలు తెరుస్తున్నారు. ప్రజలు సైతం ఒక్కసారిగా తరలిరావడంతో డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవడంతో కూరగాయల ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగిస్తుంటారు. ప్రతీ ఒక్కరికీ 300 గ్రాముల కూరగాయలు అవసరం. కరోనా ప్రభావంతో నగర జనం నాన్‌వెజ్‌కు అనాసక్తి చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం నిత్యం 4 వేల టన్నుల కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయని మార్కెటింగ్‌ శాఖ అధికారుల అంచనా. అయితే గత వారం రోజులుగా 1.5 టన్నుల నుంచి 2 టన్నుల కూరగాయాలు మాత్రమే దిగుమతి అవుతున్నాయి. మార్కెట్‌లకు డిమాండ్‌కు తగ్గ కూరగాయలు సప్లయ్‌ లేకపోవడంతో కూరగాయల కొరత ఏర్పడుతుందని మార్కెట్‌ అధికారులు పేర్కొంటున్నారు.

భయమేస్తోంది…

లాక్‌డౌన్‌కు ముందు వారపు సంత ఉదయం నుంచి రాత్రి వరకు ఉండేది. దీంతో రద్దీ కూడా తక్కువగా ఉండేది. ఇప్పడు వారపు సంతకు జనం ఎక్కువగా వస్తున్నారు. అసలే కరోనా.. అంతా దగ్గర దగ్గరగా నిలబడుతూ కొనుగోలు చేస్తున్నారు. ఎవరికి కరోనా ఉందో అర్ధం కావడం లేదు. సంతకు వచ్చి కూరగాయాలు కొనాలంటేనే భయమేస్తోంది.

— ఎర్రం శివశంకర్, వెంకటగిరికాలనీ

గుంపులు గుంపులుగా ఉంటున్నారు…

వారపు సంతలో కూరగాయలు తక్కువ ధరకు వస్తాయి. ఎప్పుడైన ఒకేసారి వారానికి సరిపడా తీసుకెళ్తా. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి సంతకు రావాలంటేనే రాబుద్ది కావడం లేదు. కొనేందుకు అంతా ఒక్కసారిగా ఎగబడుతున్నారు. భౌతిక దూరం ఎవరూ పాటించడం లేదు.

— ముస్తాక్, యూసుఫ్ గూడ

Advertisement

Next Story