అవన్నీ పుకార్లే.. ప్రజలెవ్వరూ భయపడవద్దు : డీహెచ్

by Shyam |   ( Updated:2021-08-24 08:13:10.0  )
DH-Srinivasa-Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : థర్డ్ వేవ్ పై వస్తున్న సర్వేల్లో శాస్ర్తీయత లేదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు కొట్టిపరేశారు. కరోనా మూడో దశ పరిస్థితిపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబరులో థర్డ్ వేవ్ వస్తుందనడంలో స్పష్టమైన ఆధారం లేదని తేల్చి చెప్పారు. చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న నివేదికల్లోనూ నిజం లేదన్నారు. ఇప్పటికే మొదటి, రెండో దశలో చాలా మంది చిన్నారులు వైరస్ బారిన పడ్డారని వారెవ్వరికి సీరియస్ పరిస్థితులు తలెత్తలేదన్నారు.

కానీ మూడో దశలో ఆందోళనకర పరిస్థితులు ఉంటాయని వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు గందరగోళాన్ని సృష్టించడం బాధకరమన్నారు. ప్యాండమిక్ పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉన్నా ప్రజలను భయాందోళనకు గురిచేయడం సరికాదని మండిపడ్డారు. దురదృష్టవశాత్తు థర్డ్ వేవ్ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రత ఉండదని డీహెచ్ ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. కానీ ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతికదూరం వంటి కరోనా మార్గదర్శకాలను పాటించాల్సిందేనన్నారు.

కొత్త వేరియంట్ వస్తేనే…

రాష్ర్టంలో మొదటి, రెండో వేవ్‌లలో వచ్చిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లను తట్టుకునే శక్తి ప్రజల్లో ఉందని డీహెచ్ పేర్కొన్నారు. కానీ వైరస్ మ్యూటేషన్‌తో ఏదైనా కొత్త వేరియంట్లు వస్తేనే తీవ్రత ఉండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి రోజు నమోదవుతున్న కరోనా కేసుల్లో ససెప్టబుల్ గ్రూప్(వ్యాక్సిన్ తీసుకోని వారు, ఇప్పటి వరకు ఇన్ ఫెక్ట్ కానీ వారు)కు చెందిన వారే ఉన్నారన్నారు. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. అంతేగాక మాస్కు, భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటిస్తే ఎన్ని వేరియంట్లు వచ్చినా వ్యాప్తిని సులువుగా అడ్డుకోవచ్చని డీహెచ్ అభిప్రాయసడ్డారు.

Advertisement

Next Story

Most Viewed