- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాధులకు కేరాఫ్ ‘మిషన్ భగీరథ’ నీరు.. చిత్త ‘శుద్ధి’ లేకనేనా..?
దిశ, కరీంనగర్ సిటీ : మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న శుద్ధ జలం ఇంటింటికి చేరే సరికి ‘గరళం’గా మారుతోంది. అసలే వ్యాధుల కాలం. దీనికి తోడు కొద్ధి రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ నీటిని తాగితే ఆస్పత్రుల పాలవటం ఖాయంగా తెలుస్తోంది. దీంతో నియోజకవర్గ ప్రజలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు సరఫరా చేస్తున్న భగీరథ నీటిని తాగేందుకు ఇష్టపడటం లేదు. ప్రైవేట్‌గా పంపిణీ అవుతున్న వాటర్ ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. పలు గ్రామాల్లో గత వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నది. నీటిని ఫిల్టర్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తుండటంతో ప్రజలు నీటిని వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చటం లేదు. తాగడానికి కాదు కదా.. ఈ నీటితో వంట పాత్రలు శుభ్రం చేసుకునేందుకు కూడా అయిష్టత కనబరుస్తున్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్లకేళ్లుగా ఫ్లోరైడ్, నీటిలో లవణాల శాతం ఎక్కువగా ఉన్న నీటిని సరఫరా చేయడంతో తెలంగాణ ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఈ పథకం ద్వారా శుద్ధ జలం అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకనుగుణంగా కోట్లాది రూపాయలు వెచ్చించి, జిల్లాలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కొద్దీ రోజులుగా తాగునీటి సరఫరా కూడా జరుగుతోంది. మానేరు జలాశయం నుంచి నీటిని ఫిల్టర్ బెడ్లకు తరలిస్తూ, శుద్ధి చేసిన అనంతరమే భగీరథ నల్లాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే, అధికారుల నిర్లక్ష్యంతో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని పలు గ్రామాల్లో స్వచ్ఛమైన నీటికి బదులు కలుషిత నీరు అందుతున్నది. జిల్లాలోని పలు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనగా, అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, నీటిని శుద్ధి చేయకుండానే నేరుగా కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నా.. యంత్రాంగంలో చలనం లేదు. కనీసం వాటర్ ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ వేస్తున్న దాఖలాలు కన్పించడం లేదు.
దీనికి తోడు చీటికీ మాటికి పైపులు పగులుతుండగా, ఆ పగుళ్లు నుంచి ప్రధాన పైపు లైన్లలోకి మురికి నీరు చేరి కలుషిత నీరు సరఫరా అవుతున్నది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలుంటాయి. జిల్లాలో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతుండగా పలువురు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు. దీనికి తోడు జిల్లాలో కొద్ది రోజులుగా కలుషిత నీరు సరఫరా కావడంతో మరికొంత మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రంగు మారిన నీటి సరఫరాపై అధికారులను అడిగితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి శుద్ధి చేయడం చాలా కష్టంగా మారిందనే సమాధానం వచ్చింది. రంగుమారిన నీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని, కాచి చల్లార్చిన నీటిని వాడుకోవచ్చని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి, శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.