రుణాల కోసం జగన్ సర్కార్ అడ్డదారులు: పయ్యావుల కేశవ్

by srinivas |
రుణాల కోసం జగన్ సర్కార్ అడ్డదారులు: పయ్యావుల కేశవ్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ రుణ బాగోతాలపై కేంద్రం కాగ్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రూ.25 వేలకోట్ల రుణానికి సంబంధించి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలను కూడా అతిక్రమించిందన్నారు. దేశంలో ఏరాష్ట్రం చేయని సాహసం ఏపీ చేసిందని ఆరోపించారు. శాసన సభకు తెలియకుండా, గవర్నర్ కార్యాలయాన్ని దారి మళ్లించి మరీ రుణాల కోసం అడ్డదారులు తొక్కారని ఆరోపించారు. ప్రభుత్వాలు నడపడానికి అప్పులు చేయడమనేది సాధారణమే అయినప్పటికీ.. నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలు పట్టించుకోకుండా, వ్యవస్థలను తుంగలో తొక్కేలా చేస్తే ఎలా? అని ప్రశ్నించారు.

ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ధ్వజమెత్తారు. వ్యవస్థలు బలోపేతం కావాలనే తాము కోరుకుంటున్నామే తప్ప ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను తాము ఎత్తిచూపే వరకు కేంద్రం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవతవలకు సంబంధించిన అనేక విషయాలను ఇప్పటికే బహిర్గతం చేశామని.. గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.41వేల కోట్ల చెల్లింపులకు బిల్లులు లేకపోవడం.. రూ.17వేలకోట్లు అదనంగా డ్రా చేయడం, రూ.25 వేల కోట్ల రుణాలకు సంబంధించిన వ్యవహారంపై ఏవీ సక్రమంగా జరగలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed