దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా పేటీఎం..

by Harish |   ( Updated:2021-07-16 05:26:52.0  )
busines news
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీఓల జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఐపీఓకు వచ్చేసింది. తాజాగా పెట్టుబడిదారుల్లో ఆసక్తి రేపుతున్న ప్రముఖ చెల్లింపు సేవల సంస్థ పేటీఎం సైతం ఐపీఓకు సిద్ధమవుతోంది. దీనికోసం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ సెబీకి దరఖాస్తు చేసుకుంది. సెబీ దీనికి అనుమతి గనక ఇస్తే దేశంలోనే ఇప్పటివరకు వచ్చిన వాటిలో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఐపీఓకు సంబంధించిన వివరాలను వన్97 కమ్యూనికేషన్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఇవ్వగా, సమీక్ష జరుగుతోంది. ఈ ఐపీఓలో పేటీఎం సంస్థ మొత్తం రూ. 16,600 కోట్ల నిధులను సమీకరించనుంది.

ఇందులో తాజా షేర్ల నుంచి రూ. 8,300 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ. 8,300 కోట్లను వాటాదార్లకు అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో సెబీ ఆమోదం లభిస్తే, దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా పేటీఎం ఉండనుంది. పదేళ్ల క్రితం కోల్ ఇండియా ఐపీఓకు రావడం ద్వారా రూ. 15 వేల కోట్ల నిధులను సమీకరించింది. దీన్ని పేటీఎం అధిగమించనుంది. ఈ క్రమంలో ఐపీఓకు రావాలని భావిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీలకు పేటీఎం సంస్థ ఓ మార్గదర్శిగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికే జొమాటో ఐపీఓ కొనసాగుతుండగా, మరో ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ కూడా సెబీ వద్ద దరఖాస్తు ఉంచింది. నైకా, పాలసీబజార్ కూడా ఐపీఓ బాటలో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed