అవి ఆందోళన కలిగిస్తున్నాయి: పవన్ కల్యాణ్

by Anukaran |   ( Updated:2020-07-14 02:49:57.0  )
Pawan
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని పరవాడ పారిశ్రామిక వాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. గాజువాక, పరవాడ కేంద్రాలుగా విస్తరించి ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ఫార్మా ప్రమాదాలు మరవక ముందే రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో సంభవించిన ప్రమాదం వైజాగ్‌లో భయాందోళనలు కలిగించిందన్నారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు? అని ఆయా కంపెనీల యజమాన్యాలను ప్రశ్నించారు.

‘ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు?. విశాఖ సాల్వెంట్ పరిశ్రమలో ప్రమాదకరమైన, మండే స్వభావం గల ఆయిల్స్, రసాయనాలు నిల్వ చేస్తున్నప్పుడు రక్షణ ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలి కదా?. రక్షణ ఏర్పాట్లు ఉంటే ఈ పేలుడు ఎందుకు సంభవించిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. సీఈటీపీ పరిధిలో ప్రమాదం జరిగిన పరిశ్రమను నిర్వహిస్తున్నారని వెలువడుతున్న వార్తలపై ఫార్మాసిటీ నిర్వాహకులు, ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా వివరణ ఇవ్వాలి. కర్మాగారంలో సంభవించిన పేలుడు పది కిలోమీటర్ల వరకు వినిపించిందంటే దాని స్థాయి మనం ఊహించవచ్చు.

అగ్ని కీలలను అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడవలసి వచ్చిందంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. పేలుడులో ఒకరు మృతి చెందారని, ఆరుగురు కార్మికులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలిసి చాలా ఆవేదన కలిగింది. కర్మాగారం ఆవరణలో కాలిన తీవ్ర గాయాలతో కనిపించిన మృతదేహం గత అర్ధరాత్రి నుంచి కనిపించకుండాపోయిన సీనియర్ కెమిస్ట్ శ్రీనివాస్‌దే అని తోటి వారు చెబుతున్నారు. మృతుని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన మల్లేష్‌కు మెరుగైన వైద్య సహాయం అందచేయాలి. ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed