- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పరాన్నజీవి'కి ఆస్కార్ పట్టం
పారసైట్ అంటే తెలుగులో పరాన్నజీవి… తన ఆహారం కోసం పక్కవాళ్ల మీద ఆధారపడేజీవి. కొన్ని పరాన్నజీవులు ఆతిథ్యజీవికి మేలు చేకూరుస్తాయి. కానీ, కొన్ని మాత్రం నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి పరాన్నజీవుల జీవనాన్ని ప్రతిబింబించే చిత్రమే దక్షిణ కొరియన్ సినిమా పారసైట్. ఈ కొరియన్ సినిమా పారసైట్‌లో కూడా రెండు రకాల పరాన్నజీవులు ఉంటాయి. ఇక్కడ పరాన్నజీవులు అంటే జంతువులు కాదు మనుషులే. మొదటిసారిగా ఆస్కార్ వేదిక మీద అంతర్జాతీయ సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ చిత్రబృందం కూడా హాలీవుడ్‌కి పరాన్నజీవే. కాకపోతే కళను పోషించే మంచి పరాన్నజీవి.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డులను ఈ పారసైట్ చిత్రం సొంతం చేసుకుంది. ఇంగ్లీషు సబ్‌టైటిల్స్‌తో హాలీవుడ్‌న అదరగొట్టిన ఈ సినిమాలో ప్రతీ ఫ్రేము ఒక నిగూఢ అర్థాన్ని కలిగి ఉంటుంది.
సినిమా కథేంటి?
పేదవారైన కిమ్ కుటుంబం – ఇదే మన పరాన్నజీవి ఫ్యామిలీ, తమ తెలివితేటలతో ధనవంతులైన పార్క్ కుటుంబంలో స్థానం సంపాదిస్తారు. తాము ఒకే కుటుంబం అని చెప్పకుండా తప్పుడు వివరాలు ఇచ్చి పార్క్ ఇంట్లో చేరతారు. విలాసంగా బతుకుతున్న పార్క్ కుటుంబీకులను చూసినపుడు అసూయగా పడుతుంటారు. కిమ్ కుటుంబీకుల ఉద్దేశంలో పార్క్ కుటుంబీకులు మంచివాళ్లే… కానీ అది ధనం వల్ల వచ్చిన మంచితనం అనేది వారి అభిప్రాయం.
సినిమా ఇంటర్వెల్ సమయానికి ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది. ఎక్కడ వారి నిజస్వరూపం పార్క్ కుటుంబానికి తెలుస్తుందోనని కిమ్ కుటుంబం ఆందోళన పడుతుంది. ఆ ఆందోళన నుంచే ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయమే పార్క్ కుటుంబంతో పాటు వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేస్తుంది.
కథాంశం చిన్నదే.. స్క్రీన్ ప్లే అసలు హీరో
కొరియాలో ధనిక, పేద కుటుంబాల జీవనశైలిని కథాంశంగా తీసుకుని దర్శకుడు బాంగ్ జూన్ హో తెరకెక్కించిన స్క్రీన్ ప్లే అద్భుతంగా అనిపిస్తుంది. పెద్ద మ్యాన్షన్‌లో ఉండే ధనికుల ఇంట్లో పనికి కుదిరిన కిమ్ కుటుంబం చిన్న సెల్లార్‌లో నివాసముంటుంది. ఆస్తులు లేకపోయినప్పటికీ వాళ్ల తెలివితేటలతో కిమ్ కుటుంబం ఒక్కొక్కరుగా పార్క్ కుటుంబంలో ఉద్యోగంలో చేరడం వారి కుటిల బుద్ధిని సాక్షాత్కరిస్తుంది.
సమాజంలో అసమానతలను ప్రతి ఫ్రేములో బాంగ్ జూన్ కనిపించేలా చేశాడు. కానీ వారి బుద్ధుల్లో ఆంతర్యాలను కూడా అంతే పద్ధతిగా వివరిస్తాడు. ఎంత గొప్ప ప్రణాళిక వేసినా కూడా అత్యాశ పెరిగినపుడు భగవంతుడే ఆ ప్రణాళికకు అడ్డుకట్ట వేస్తాడని ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ ద్వారా చెప్తాడు. అంతేకాకుండా ధనానికి తక్కువైనా ఆత్మగౌరవం విషయంలో పేద ధనిక తేడాలుండవని క్లైమాక్స్ ట్విస్ట్ ద్వారా చూపిస్తాడు.
ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే..
భారీ స్థాయిలో సెట్టింగులు లేవు, భారీ ఎత్తున విజువల్ ఎఫెక్టులు లేవు, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తారలు కూడా కాదు.. అయినప్పటికీ ఈ సినిమాకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని కథాకథనం చూస్తే అనిపిస్తుంది. ముఖ్యంగా కిమ్ కుటుంబీకులుగా నటించిన వారి నటన గురించి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాత్రలో వాళ్లు జీవించిన విధానం, పరిస్థితికి తగ్గట్లుగా ముఖకవళికలు ఈ సినిమాను అవార్డు వేడుకల్లో ప్రధాన భూమిక పోషించేలా చేశాయి.
మొత్తం ఆరు ఆస్కార్ నామినేషన్లలో నాలుగు అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. స్క్రీన్ మీద సబ్‌టైటిల్ కనిపించే గీతను ప్రేక్షకుడు దాటగలిగితే భాషాంతరం తగ్గి ఎన్నో అద్భుతాలు సృష్టించే అవకాశం దర్శకులకు వస్తుందని ఓ అవార్డు వేడుకలో బాంగ్ జూన్ అన్నది అక్షరాల నిజమని ఈ సినిమా నిరూపించింది.