అమృత్‌సర్ టు దుబాయ్.. విమానంలో ఒకే ఒక్కడు !

by Shyam |   ( Updated:2021-06-26 04:11:04.0  )
అమృత్‌సర్ టు దుబాయ్.. విమానంలో ఒకే ఒక్కడు !
X

దిశ, ఫీచర్స్ : చాలామంది ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. తమ పయనంలోని ప్రతీ మూమెంట్‌ను ఆనందంగా మలుచుకుంటారు. కానీ కొన్ని ప్రయాణాలు ఊహించని క్షణాలను మనకు అందిస్తుంటాయి. ప్రవాస భారతీయుడు బిజినెస్‌మ్యాన్, ఫిలాంత్రపిస్ట్ ఎస్‌పి సింగ్ కూడా సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని పొందాడు. అమృత్‌సర్ నుంచి దుబాయ్ వరకు విమానంలో సింగిల్‌గా జర్నీ చేసి, తన జీవిత పుస్తకంలో ఓ అరుదైన అవకాశాన్ని అందుకున్నాడు. లైఫ్‌లాంగ్ గుర్తుండిపోయే అతడి జర్నీ విశేషాలేంటో తెలుసుకుందాం.

సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ బుధవారం అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఫ్లైట్ టైమ్‌కు ముందే ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాడు. అతడి వద్ద ట్రావెల్ డాక్యుమెంట్స్, గోల్డెన్ వీసా‌తో పాటు ఫుల్ వాక్సినేషన్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ విమానంలో ఒక్కరే ప్యాసింజర్‌ కావడంతో ఎక్కేందుకు ఒబెరాయ్‌కి అనుమతి లభించలేదు. అయితే ఒబెరాయ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చెందిన ఆఫీసర్లతో మాట్లాడి, ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతి తీసుకుని గొల్డెన్ చాన్స్ దక్కించుకున్నాడు.

దాంతో అతను ఒక్కడే ప్యాసింజర్ కావడంతో ఎయిర్ ఇండియా సిబ్బందితో పాటు పైలట్ కూడా అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. తనను ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేయడంతో పాటు, ఖాళీ ఫ్లైట్‌లో తన ఫొటోలు కూడా తీశారు. సాధారణంగా పైలట్, ఇతర సిబ్బందితో ఫొటోలు తీసుకోవడం కుదరదు. కానీ తనకు మాత్రం ఆ అవకాశం దక్కింది. అమృత్‌సర్ నుంచి దుబాయ్ వరకు దాదాపు మూడు గంటల జర్నీలో మహారాజులా ప్రయాణించాడు ఒబెరాయ్. అయితే మే19న ముంబై-దుబాయ్ బోయింగ్ విమానంలో భవేష్ జావేరి అనే 40 ఏళ్ల వ్యక్తి కూడా ఇలాంటి అరుదైన అవకాశంతో ఒంటరిగా ప్రయాణంచాడు. ఇక మే 22న కూడా ఓస్వాల్డ్ రోడ్రిగ్స్ అనే మరో వ్యక్తి ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ముంబై-దుబాయ్ విమానంలో సోలో ట్రావెల్ చేశాడు.

66 ఏళ్ల ఒబెరాయ్ పంజాబ్‌లోని పాటియాలాకు చెందినవాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ప్రాపర్టీస్ & ఇన్వెస్ట్‌మెంట్స్ ఎల్‌ఎల్‌సి అనే సొంత వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అతను కొన్నేళ్ల క్రితం భారతదేశం నుంచి దుబాయ్‌కి వెళ్ళి నాలుగు సంవత్సరాల పాటు మెకానిక్‌గా పనిచేశాడు. ఆతర్వాత తన ప్రతిభతో సొంత సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగాడు. 2020లో కొవిడ్ -19 ప్రేరిత లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చినప్పుడు భారతీయ కార్మికులను స్వదేశానికి రప్పించడంలో చురుకైన పాత్ర పోషించాడు ఒబెరాయ్.

భారతదేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 24న విమాన ప్రయాణం నిషేధించినప్పటికీ.. యుఏఈ అధికారులు, దౌత్యవేత్తలు, గోల్డెన్ వీసా హోల్డర్లు, ఎమిరాటిలను తమ దేశం వెళ్లడానికి అనుమతించారు. అయితే జూన్ 19న దుబాయ్ అధికారులు చేసిన ప్రకటన ప్రకారం బుధవారం ఉభయ దేశాల మధ్య సాధారణ ప్రజల కోసం విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రకటించినా.. ఇంకా ఈ విమాన సర్వీస్ ప్రారంభం కాలేదు.

‘కొన్నిసార్లు కీలకమైన పరిస్థితుల్లో జీవితాన్ని ఆనందించే అవకాశాలు లభిస్తాయి. వాటిని వదులుకోవద్దు. ప్రస్తుతం నేను చేసిన ప్రయాణం నా జీవితంలో మధురమైంది. మహారాజులా ప్రయాణించే అవకాశం కేవలం 740 దిర్హామ్‌లకే లభించింది. ఇలాంటి చిరస్మరణీయ ప్రయాణం అందించినందుకు యుఏఈ, భారత ప్రభుత్వాలను ఎంతో అభినందిస్తున్నాను. ప్రత్యేక సేవలు కల్పించినందుకు ఎయిర్ ఇండియాకు నా ధన్యవాదాలు. ఖాళీ విమానంలో ఉన్న నన్ను అనేక ఫొటోలు తీశారు’ అని ఒబెరాయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed