Supreme court: ఆ నివేదికను బహిర్గతం చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Supreme court: ఆ నివేదికను బహిర్గతం చేయలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భద్రతా కారణాల దృష్యా దేశ వ్యతిరేకులపై స్పై వేర్ ఉపయోగిస్తే తప్పేంటని సుప్రీంకోర్టు (Supreme court) ప్రశ్నించింది. స్పైవేర్ కలిగి ఉండటంలో ఎటువంటి సమస్యా లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత నిమిత్తం సాఫ్ట్ వేర్ ఉపయోగించడంలో తప్పులేదని దానిని ఎవరిపై ప్రయోగిస్తున్నామనేదే కీలకమని తెలిపింది. స్పై వేర్ పెగాసస్ కేసుపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ (Surya kanth), ఎన్ కోటేశ్వర్ సింగ్‌ (Kotishwar singh) లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రభుత్వం ఉగ్రవాదులపై గూఢచర్యం చేస్తుంటే అందులో తప్పేముందని పిటిషనర్లను ప్రశ్నించింది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం కాబట్టి టెక్నికల్ కమిటీ నివేదికను బహిరంగపర్చబోమని వెల్లడించింది. దేశ సెక్యురిటీ విషయంలో రాజీ పడలేమని, కమిటీ రిపోర్టును వీధుల్లో చర్చించలేమని పేర్కొంది.

అయితే గోప్యతకు సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించిన ఆందోళనలను తాము పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. పౌర సమాజంలోని వ్యక్తులపై స్పైవేర్ వాడితే దానిని పరిశీలిస్తామని నొక్కి చెప్పింది. సాధారణ పౌరుల హక్కులను రాజ్యాంగం ప్రకారం రక్షిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఉగ్రవాదులపై పెగాసస్‌ను ఉపయోగించడంపై అభ్యంతరం ఏమిటని అడిగారు. ఉగ్రవాదులకు గోప్యత హక్కు లేదన్నారు.

కాగా, పెగాసస్ అనేది మొబైల్ ఫోన్‌లను హ్యాక్ చేయడానికి ఉపయోగించే ఒక సాఫ్ట వేర్. దీనిని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ తయారు చేయగా.. 2017లో భారత్ కొనుగోలు చేసింది. అయితే 2021లో దేశంలోని అనేక మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల ఫోన్‌లను స్పైవేర్ ఉపయోగించి హ్యాక్ చేశారని ఆరోపణలున్నాయి. సుమారు 300 మందికిపై ప్రభుత్వం నిఘా పెట్టిందని విమర్శలున్నాయి. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీంకోర్టు ఓ టెక్నికల్ కమిటీని నియమించింది. 2022 ఆగస్టులో కమిటీ తన నివేదికను అందజేసింది. ఈ రిపోర్టును బహిరంగ పర్చాలని పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్లపై కోర్టు విచారిస్తోంది.



Next Story

Most Viewed