- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాప్రతినిధుల కేసుల్లో నిర్లక్ష్యం.. 5 శాతమే శిక్షలు ఖరారు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సందర్భంలో తమపై కేసులు ఉన్నాయని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు సమర్పించిన అఫిడవిట్లలోనే పేర్కొన్నారు. కానీ వాటిని నిరూపణ చేయడంలో పోలీసుశాఖ, ప్రాసిక్యూషన్ నిర్లక్ష్యంతో కేసులు వీగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో ఇప్పటివరకు వచ్చిన తీర్పులను పరిశీలిస్తే.. కేవలం 5శాతం మాత్రమే శిక్షలు పడ్డాయి. అభియోగాల నమోదులో పోలీసుశాఖ పనితీరు ఎలా ఉందో, ప్రాసిక్యూషన్ అలసత్వం ఎలా ఉందో స్పష్టమవుతుంది. శిక్షపడిన కేసులలో స్టేలు వస్తుండటంతో ప్రజలకు పోలీసుశాఖపై, న్యాయవ్యవస్థపై నమ్మకం పోతోంది.
చట్ట సభల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల నిరూపణలో ఓ వైపు పోలీసుశాఖ, మరోవైపు పీపీల వైఫల్యం స్పష్టమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 507 కేసులు నమోదు అయ్యాయి. వారే స్వయంగా కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. అయినప్పటికీ అభియోగాల నమోదులో పోలీసుశాఖ వైఫల్యంతో కేవలం 5 శాతం మాత్రమే శిక్షలు పడ్డాయి. కేసుల సత్వర విచారణకు రాష్ట్రంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని 2017 డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2018లో హైదరాబాద్ నాంపల్లి కోర్టుల సముదాయంలో ప్రత్యేక న్యాయస్థానంను ఏర్పాటు చేసింది.
ఈ కోర్టులో 30 మంది సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మూడేళ్లు గడుస్తున్నా.. నేటి వరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో కేసుల విచారణ మందకోడిగా జరుగుతోంది. చట్టసభల ప్రతినిధులపై రాష్ట్రంలో నమోదైన కేసుల బదిలీలోనూ ఆలస్యమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వివిధ జిల్లాల్లోని మొత్తం 507 కేసులు నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ కావాలి. కానీ ఈ మూడేళ్లలో కేవలం 346 కేసులు మాత్రమే కోర్టుకు చేరాయి. ఇంకా 161 కేసులు బదిలీ కావల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రత్యేక న్యాయస్థానంలో కేసుల తీర్పులు వీగిపోతున్నాయి. కోర్టుకు బదిలీ అయిన మొత్తం 346 కేసుల్లో 205 కేసులల్లో తీర్పు రాగా.. అందులో కేవలం 11 కేసుల్లో మాత్రమే శిక్షపడింది. మిగిలిన 194 కేసులు వీగిపోయాయి. శిక్ష పడిన 11 కేసుల్లో 4 కేసుల్లో జైలు శిక్ష, మిగిలిన 7 కేసుల్లో జరిమానా విధించారు. జైలు శిక్షపడిన నాలుగు కేసుల నిందితులు హైకోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. అలాగే ఒక కేసును పూర్తిగా కొట్టివేశారు. కేసులు వీగిపోవడానికి పోలీసుశాఖపై శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల ఒత్తిడి ఉందనే అనుమానం కలుగుతోంది.
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం జడ్జీలను బదిలీ చేయొద్దని ఆదేశించింది. అయినప్పటికీ ఈ మధ్యనే ఒక జడ్జీని బదిలీ చేశారు. దీంతో కొత్తగా వచ్చేవారు మళ్లీ కేసులను స్టడీ చేసి విచారణ చేపట్టేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కేసుల్లో శిక్షలు పడే అవకాశం తక్కువగా ఉండటంతో పాటు కేసులు సైతం వీగిపోయే అవకాశాలు సైతం లేకపోలేదు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2019లో కేసు నమోదు కాగా.. ఏడాదిపాటు జైలుశిక్ష పడింది. 2013లో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కాగా.. నేరం రుజువు కావడంతో ఈ ఏడాది జూలైలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కోర్టు 6 నెలలు సాధారణ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రూ.4200, ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు రూ.700, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డికి 3,500, టీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్ సింగ్ రాథోడ్ కు రూ.650 , ఎమ్మెల్యే జోగు రామన్న, నాయకుడు సీహెచ్ విజయరామారావు, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే లకు రూ.600ల చొప్పున జరిమానా పడింది. అయితే కోర్టుల్లో సరిపడా సిబ్బంది లేక, మరోవైపు పోలీసులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగానే కేసులు వీగిపోతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రజలకు పోలీసుశాఖ, కోర్టులపై నమ్మకం కలిగేలా కేసుల్లో శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజాప్రతినిధులపై కేసులు
1. 64 మంది శాసనసభ్యులపై -344
2.10 మంది పార్లమెంట్ సభ్యులపై -133
3.మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలపై- 30
మొత్తం 507
==================
కేసుల వివరాలు
========================
1. మూడేళ్లలో కోర్టుకు బదిలీ అయిన కేసులు -346
2.ఇప్పటి వరకు వెలువడిన తీర్పులు-205
3.కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు-141
4.శిక్షలు పడిన కేసులు-11
5.శిక్షల శాతం -5 శాతం
===========================
కేసులను కోర్టులకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర డీజీపీ తక్షణమే వివిధ జిల్లాల్లోని కోర్టుల్లో ఉన్న కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ ను కోరాం. ప్రాసిక్యూషన్ తగిన శ్రద్ధ తీసుకొని కేసులు వీగిపోకుండా చూడాలి. హైకోర్టులో స్టే ఇచ్చిన వాటిపై స్టే ఎత్తివేతకు చర్యలు తీసుకొని ఆదేశాలు ఇవ్వాలి. కేసుల విచారణలో పోలీసులు శ్రద్ధ తీసుకోవాలి. నేరారోపణలు ఎదుర్కొంటున్న చట్టసభల ప్రతినిధుల్లో కొందరు పోలీసుశాఖపై ఒత్తిడి తెస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు కోర్టులో తగిన సిబ్బంది నియమించి విచారణను వేగవంతం చేయాలి.
=ఎం. పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
- Tags
- court
- Government