ఉచిత విద్యుత్ స్కీమ్.. సీఎం ఆదేశాలనే పట్టించుకోరా.?

by Shyam |
Kcr Free Power
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ సర్కారుకు పథకాలు ప్రకటించడంలో ఉన్నంత ఆర్భాటం వాటి అమలులో లేకపోయింది. 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని లాండ్రీలు, ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఆ పథకం అమలుపై అవగాహన మాత్రం కల్పించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకం ప్రారంభంలో దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నో నిబంధనలు అడ్డంకిగా మారాయి.

వాటిని సంఘం నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి కొన్ని నిబంధనలు ఎత్తివేసినా దరఖాస్తు చేసుకోవడంలో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక పథకానికి దూరమవుతున్నారు. ఇబ్బందులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మరింత ఎక్కువగా ఉంది. గతంలో తెలియక తప్పుగా దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులు సరిదిద్దుకున్నప్పటికీ ఎంతోమంది నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నా లబ్ధిదారులనుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అధికారుల అలసత్వం, లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో వైఫల్యం కావడంతో 250 యూనిట్ల ఉచిత పథకం నామమాత్రంగానే మిగిలిపోయింది.

తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెలూన్లు, ధోభీ‌ఘాట్లు, లాండ్రీలకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. ఈ పథకాన్ని అమలు చేస్తూ రూ.198 కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది రజకులకు, 70 వేల మంది నాయీ బ్రాహ్మణులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. కానీ, కొవిడ్ కారణంగా కొందరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకపోగా మరికొంత మంది అవగాహన లోపంతో నమోదు చేసుకోలేదు.

తెలంగాణలో 70 వేల సెలూన్లుంటే అందులో దరఖాస్తు పూర్తి అయింది మాత్రం 24 వేలుగా ఉండటం గమనార్హం. 589 ధోబీఘాట్లలో 139 ఘాట్లు మాత్రమే నమోదు చేసుకున్నాయి. రజక, నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ పవర్ స్కీమ్‌ను మెజారిటీ దోభీ ఘాట్లు, సెలూన్ షాప్ ఓనర్లు వియోగించుకోలేకపోతున్నారనేది ఇక్కడే స్పష్టమవుతోంది. పథకం అమల్లోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా దరఖాస్తుల నమోదు అంతంత మాత్రంగానే ఉండటంతో కొద్ది రోజుల క్రితం నుంచి అధికారులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో అసలు అధికారులు అవగాహన కల్పిస్తున్నారా? లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 22,500 సెలూన్ షాపులున్నాయి. ఇందులో 50వేల మంది పనిచేస్తున్నారు. వీరిపై ఆధారపడి 2 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. ఈ 22,500 షాపుల్లో ఇప్పటి వరకు 6400 దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మేడ్చల్ జిల్లా నుంచి 2300 దరఖాస్తులు వస్తే రంగారెడ్డి జిల్లా నుంచి 2200, హైదరాబాద్ నుంచి 1900 మంది దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం.

గ్రేటర్ పరిధిలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి వేరేగా చెప్పనక్కర్లేదు. గ్రేటర్ పరిధిలో 29 ధోబీ ఘాట్లు, 1038 లాండ్రీ షాపులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. చాలా వరకు అవగాహన లేక, కుల ధృవీకరణ పత్రం, కమ్యూనికేషన్ లోపాలతో పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయామని నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు చెబుతున్నారు. ఆంధ్ర పాలకుల హయాంలో ఆదరణకు నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులపై ఆధారపడ్డ వారికి సర్కార్ అండగా నిలుస్తున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు చొరవ తీసుకొని అందరూ పథకంలో భాగమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పథకం అమలుపై గ్రామీణ స్థాయి వరకు అవగాహనా కల్పించాలని సీఎం ఆదేశాలున్నా అధికారుల నిర్లక్ష్యంతోనే అనుకుంత స్థాయిలో దరఖాస్తులు చేసుకోలేకపోతున్నట్లు రజక సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ లో రూ.198 కోట్లు ఈ పథకానికి కేటాయించగా అందులో రజక సంక్షేమానికి రూ.వంద కోట్ల 80 లక్షలు కేటాయించారని రజక సంఘం నేతలు చెబుతున్నారు. అయితే ఫ్రీ పవర్ కోసం గతంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఈ పథకం వర్తిస్తుందా? లేదా అనే అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు క్యాస్ట్ సర్టిఫికెట్ ఆలస్యమవడంతో ఇంకొందరు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని వాపోతున్నారు.

అందరికీ లబ్ధి చేకూరేలా చూడాలి.

తెలంగాణ సర్కార్ లాండ్రీలు, ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు అందించడం మంచిందే. కానీ దరఖాస్తు చేసుకుందామంటే ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తప్పుగా నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా అందిస్తున్నా అవగాహన లోపం వల్ల నమోదుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
– సత్యనారాయణ, రజక సంఘాల రాష్ట్ర చీఫ్ అడ్వైజర్, ఎంబీసీ కన్వీనర్

గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందించాలి..

తెలంగాణ ప్రభుత్వం సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు 250 యూనిట్లు ఉచితంగా ఇచ్చినట్లే గృహావసరాలకు సైతం ఉచితంగా 250 యూనిట్లు అందించాలి. బీసీ ఫెడరేషన్‌కు నిధులు కేటాయించాలి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఫెడరేషన్ మూతపడినట్లు అయింది. వెంటనే పాలకమండళ్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలి. బీసీ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. 250 ఉచిత విద్యుత్ పథకం పనులు ఇప్పుడిప్పుడే చురుకుగా సాగుతున్నాయి. వీలైనంత త్వరగా అర్హులకు అందేలా చూడాలి.
– రాచమల్ల బాలకృష్ణ, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Next Story