రద్దయిన టెస్టులు ఆడే ప్రసక్తే లేదు: బంగ్లాదేశ్

by Shyam |
రద్దయిన టెస్టులు ఆడే ప్రసక్తే లేదు: బంగ్లాదేశ్
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా రద్దయిన టెస్టులను తిరిగి ఆడే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన 8 టెస్టు మ్యాచ్‌లు కరోనా వల్ల రద్దయ్యాయని, వీటికి మరికొంత సమయం పొడిగిస్తే తప్ప రద్దయిన మ్యాచ్‌లు ఆడబోమని స్పష్టం చేసింది. రెండేళ్ల కాలవ్యవధిలో 12దేశాలతో ఆరు టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. మూడు హోం టెస్టు సిరీస్‌లు, మూడు విదేశీ సిరీస్‌లు ఆడిన తర్వాత టాప్‌లో ఉన్న రెండు జట్లు లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. అయితే ఒక సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడాలన్నది ఆయా దేశాలు నిర్ణయించుకుంటాయి. అన్ని దేశాలు సమానమైన టెస్టులు ఆడాల్సిన అవసరం లేదు. అయితే, ఈ ఎనిమిది మ్యాచ్‌లను బంగ్లాదేశ్ కోల్పోవడంతో ఐసీసీకి లేఖ రాసింది. రెండేళ్ల కాలవ్యవధిలో తాము మూడు నెలలు నష్టపోయామని, ఆ సమయాన్ని పొడిగిస్తేనే రద్దయిన మ్యాచులు ఆడతామని తెలిపింది. లేదంటే పాయింట్లను పంచాలని బంగ్లా క్రికెట్ బోర్డు కోరుతోంది. కాగా, బంగ్లా విజ్ఞప్తిపై ఐసీసీ స్పందించాల్సి ఉంది.

Advertisement

Next Story