బుగ్గలు గిల్లితే నో ప్రాబ్లం.. కౌగిలించుకుంటేనే నేరం..!

by Sumithra |   ( Updated:2021-02-05 11:21:20.0  )
బుగ్గలు గిల్లితే నో ప్రాబ్లం.. కౌగిలించుకుంటేనే నేరం..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కోర్టులు ఇస్తున్న కొన్ని తీర్పులు వివాదస్పదం అవుతున్నాయి. ఐపీసీ సెక్షన్స్‌ను అనుసరించి తీర్పులు వెలుబడుతున్నా.. ప్రజల్లోకి మాత్రం అవి నెగిటివ్‌గా వెలుతున్నాయి. ముఖ్యంగా అత్యాచారయత్నం కేసుల తీర్పుల్లో ఈ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నాగపూర్ కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. యువతి చేతులు కట్టేసి, ప్యాంట్ జిప్ తీసినా లైగింక వేధింపుల చట్టం కిందికి రాదనేది ఆ తీర్పు సారాంశం. అలాంటి తీర్పే ముంబైలోని ఓ స్పెషల్ కోర్టు ఇచ్చింది. ఇంతకూ ఆ తీర్పు ఏంటంటే…

మరమ్మతులకు గురైన ఫ్రిజ్‌ను రిపేర్ చేయడానికి ఓ మహిళ(33) ఎలక్ట్రిషియన్ సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఇంటికి వచ్చిన ఎలక్ట్రిషియన్‌కు ఫ్రిజ్ సమస్యను వివరించి, కిచెన్‌లో తన పనుల్లో మునిగిపోయింది. ఆ సమయంలో ఇంట్లో తన ఐదేండ్ల కుమార్తె మాత్రమే ఉన్నది. ఇంట్లో తల్లీ కూతురే ఉన్నదని గ్రహించిన ఎలక్ట్రిషియన్ మదిలో దుర్భుద్ది కలిగింది.

ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారిని దగ్గరికి తీసుకొని అసభ్యంగా తడమడంతోపాటు బుగ్గలను గిల్లాడు. ఆ తర్వాత చిన్నారి వదిలేసి కిచెన్‌లోకి మహిళను వెనక నుంచి కౌగిలించుకున్నాడు. చేతులతో ఆమె ఒళ్లంతా నిమిరాడు. ఆ హఠాత్ పరిణామంతో షాక్ తిన్న మహిళ అతడిని గట్టిగా నెట్టేసి, దాడి చేయబోయింది. బలంగా ఉన్న ఎలక్ట్రిషియన్ ఆమెను అడ్డుకొని మళ్లీ ముందు నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు. అతడిని వదిలించుకున్న మహిళ.. గట్టిగా అరుస్తూ బయటకు గెంటేసి తలుపులు పెట్టేసుకుంది.

వెంటనే ఎలక్ట్రిషియన్ పనిచేసే సంస్థ మేనేజర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు తన సోదరికి జరిగిన విషయం చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భయంభయంగా ఉన్న బాలికను ఏం జరిగిందని తల్లి ప్రశ్నించగా.. ఎలక్ట్రియన్ తన పట్ల వ్యవహరించిన తీరును వివరించింది. 2017 జూన్ 2న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎలక్ట్రిషియన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేశారు.

ఈ కేసు విచారణ పూర్తి చేసిన స్పెషల్ కోర్టు.. ఐదేళ్ల బాలిక పట్ల ఎలక్ట్రిషియన్ వ్యవహరించిన తీరును పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని చెప్పింది. కానీ తల్లిని కౌగిలించుకోవడం నేరమేనని, ఇందుకు ఏడాది జైలుతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed