ప్రాథమిక హక్కులు సంపూర్ణమైనవి కావు: కేంద్రం

by Anukaran |
ప్రాథమిక హక్కులు సంపూర్ణమైనవి కావు: కేంద్రం
X

న్యూఢిల్లీ: రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులేవీ సంపూర్ణమైనవి కావని కేంద్ర ప్రభుత్వం బుధవారం పేర్కొంది. గోప్యత హక్కు సహా అన్ని ఫండమెంటల్ రైట్స్ అబ్జల్యూట్ కాదని తెలిపింది. అన్ని హక్కులూ కొన్ని పరిమితులకు లోబడే ఉంటాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కొత్త డిజిటల్ రూల్స్‌ను చాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ వేసిన పిటిషన్‌పై ఆయన స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కొత్త నిబంధనలతో యూజర్‌ల గోప్యత ప్రమాదంలో పడుతుందని, అంతిమంగా వారు చేసే ప్రతి మెస్సేజీపైనా నిఘా పెట్టాల్సి వస్తుందని వాట్సాప్ పేర్కొంది. మెస్సేజీ పంపిన వ్యక్తి వివరాలను నమోదుచేయడమంటే గోప్యత హక్కును కాలరాయడమేనని, దీనివల్ల జర్నలిస్టులు, యాక్టివిస్టులు, పాలసీ, పాలిటీషియన్‌లపై అవగాహన లేదా విమర్శలు తీసుకువచ్చే వారికీ ముప్పు ఉండే అవకాశముందని తెలిపింది. కొత్త డిజిటల్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే విడుదల చేసి వాటిని అమలు చేయడానికి సోషల్ మీడియా సంస్థలకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో వాట్సాప్ సంస్థ గోప్యతను ప్రమాదంలోకి నెడుతున్న ఓ నిబంధనను సవాల్ చేస్తూ లా సూట్ వేసింది. ఈ పిటిషన్‌పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు.

లా అండ్ ఆర్డర్ కోసమే..

భారత పౌరులందరి గోప్యతను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, అదే సమయంలో లా అండ్ ఆర్డర్, దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను నిర్వర్తించాల్సి ఉన్నదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వ్యక్తిగత వివరాలు దర్యాప్తు, సార్వభౌమత్వానికి సంబంధించిన నేరాలు, దేశ రక్షణ, సమగ్రతకు వ్యతిరేకంగా, అల్లర్ల ప్రేరేపించే ప్రయత్నాలను అడ్డుకోవడానికి లేదా పాల్పడి ఉంటే శిక్షించడానికి అందించాల్సి ఉంటుందని వివరించారు. వీటితోపాటు లైంగిక నేరాలకూ వివరాల అడిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. అల్లర్లకు, నేరాలకు ప్రేరేపించే సందేశాలు పంపి వైరల్ చేసే వ్యక్తి ఎవరనేది కనుక్కోవడం ప్రజా ప్రయోజనార్థం అవసరమని తెలిపారు. అది కూడా దర్యాప్తు ఏజెన్సీలకు వేరే అవకాశమేమీ కనిపించకుంటేనే చివరి అంశంగా సోషల్ మీడియా సైట్స్‌ను వివరాలు కోరుతారని పేర్కొన్నారు.

యూజర్లపై నిఘా వేయడమే

సందేశాలు పంపిన వ్యక్తిని కనిపెట్టడమంటే వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని వాట్సాప్ సంస్థ అభిప్రాయపడింది. చాట్‌ను ట్రేస్ చేయడమంటే, యూజర్లు పంపే ప్రతి మెస్సేజీని ట్రాక్ చేయమని చెప్పడమేనని పేర్కొంది. వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ సర్వీసు ఉంటుందని, అంటే పంపిన మెస్సేజీ రిసీవ్ చేసుకున్నవారికే కనిపిస్తుందని, కానీ, కొత్త చట్టాలతో ఆ మెస్సేజీలనూ కనిపెట్టాల్సి ఉంటుందని వివరించింది. అయితే, ఇలా ట్రేస్ చేయాలన్నా ప్రతి రోజూ పంపించే వందల కోట్ల సందేశాలకు సంబంధించి ఎవరు ఏం రాశారని, ఎవరు ఏం షేర్ చేశారన్న వివరాలు ప్రైవేటు కంపెనీలు షేర్ చేయాల్సి వస్తుంది. అంటే ఆయా సంస్థలు వారి అవసరానికి మించి పెద్దమొత్తంలో డేటాను కలెక్ట్ చేయాల్సి రావడమూ సంస్థల విముఖతకు కారణంగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed