బాలే డ్యాన్స్‌తో స్కాలర్‌షిప్ పొందిన 11 ఏళ్ల బాలుడు

by Shyam |
బాలే డ్యాన్స్‌తో స్కాలర్‌షిప్ పొందిన 11 ఏళ్ల బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్ :
నృత్య రకాల్లో ‘బాలే’ డ్యాన్స్ కూడా ఒకటి. ఈ డ్యాన్స్ ప్రక్రియ 15వ శతాబ్దంలో ఇటలీలో మొదలైందన్నది తెలిసిన విషయమే. అయితే, దీన్ని ఎక్కువగా ఆడవాళ్లే చేయడంతో.. బాలే డ్యాన్స్ అంటే ఫిమేల్ డ్యాన్సర్లు మాత్రమే చేస్తారన్న అపోహ ఉంది. ఈ క్రమంలో నైజీరియాకు చెందిన 11 ఏళ్ల ‘ఆంథోనీ మెసోమ మడు’ అనే అబ్బాయి.. డ్యాన్స్‌లో జెండర్ బయాస్ ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ ధోరణికి నిరసనగా.. జోరుగా వాన కురుస్తుండగా, కాళ్లకు షూస్ లేకుండా, యావత్ ప్రపంచం గుర్తు చేసుకునేలా ‘బాలే డాన్స్’ చేసి చూపించాడు. నైజీరియాలోని లగూన్ సిటీకి చెందిన ఆంథోని చేసిన డ్యాన్స్ వీడియో.. అనుకున్నట్లుగానే ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. అంతేకాదు, ఆ పిల్లోడి ప్రతిభను గుర్తించిన న్యూయార్క్ డ్యాన్స్ స్కూల్ తాజాగా స్కాలర్‌షిప్ కూడా మంజూరు చేసింది.

ఆంథోనీ చేసిన డ్యాన్స్‌ను చూసిన ఎందరో సెలబ్రిటీలు.. తన టాలెంట్‌‌‌‌‌‌‌‌ను తెగ మెచ్చుకున్నారు. హాలీవుడ్ సూపర్ స్టార్ వియోల డేవిస్, ఇతర సెలబ్రిటీలు కూడా ఆన్‌లైన్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. 20 మిలియన్ల ప్రజలు ఆంథోని వీడియోను చూశారు. ఈ క్రమంలోనే యునైటెడ్ స్టేట్స్‌లోని ‘అమెరికన్ బాలే థియేటర్’ దృష్టిలో పడింది. తన టాలెంట్‌కు ఫిదా అయిన బాలే థియేటర్ వాళ్లు.. అతనికి స్కాలర్‌షిప్ ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చి, వర్చువల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కరోనా తగ్గిన తర్వాత.. అంటే వచ్చే ఏడాది అమెరికాలోని థియేటర్‌లో బాలే డ్యాన్స్ శిక్షణ ఇస్తామని తెలిపారు.

‘నేనుండే చోట .. నాలాంటి బాలే డ్యాన్సర్లు ఎవరూ లేరు. అందుకే బాలేను చూసినప్పుడు ఇది మహిళలకు మాత్రమే అనుకునేవారు. కానీ అది నిజం కాదు. అందుకే అలా అనుకున్నవారు నా డ్యాన్స్ చూసినప్పుడల్లా మగ బాలే డ్యాన్సర్లు ఉంటారని వారికి గుర్తుకు రావాలనుకున్నా. నేను డ్యాన్స్ చేస్తుంటే ఏదో ఓ కల కంటున్నట్లు అనిపిస్తుంది. చాలా మంది నా వీడియోలు చూస్తున్నారని మా టీచర్ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా కోచ్‌ను నేను ఆదర్శంగా తీసుకుంటాను. నా కల నెరవేరింది. త్వరలో నేను విమానం ఎక్కబోతున్నాను. అంతేకాదు నాకు యూఎస్ ప్రైజ్ (స్కాలర్‌షిప్) కూడా వచ్చింది. ఇదంతా నా బాలే డ్యాన్స్ వల్లే సాధ్యమైంది’ అని తెగ సంతోష పడుతున్నాడు ఆంథోని.

ఇక ఆంథోనికి డ్యాన్స్ నేర్పించిన గురువు డేనియల్ అజాలా కూడా శిష్యుడికి గుర్తింపు దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన 2017లో ‘లీప్ ఆఫ్ డాన్స్ అకాడమీ’ ఏర్పాటు చేసి, ఇంట్రెస్ట్ ఉండి డబ్బు లేని స్టూడెంట్స్‌‌కు ఫ్రీ కోచింగ్ ఇస్తుండటం విశేషం. తన డ్యాన్స్ అకాడమీలోని 12 మంది విద్యార్థుల్లో ఆంథోనీ కూడా ఒకరు.

Advertisement

Next Story

Most Viewed