ప్రమాణ స్వీకారంపై గ్రేటర్ కార్పొరేటర్ల అభ్యంతరం!

by Shyam |   ( Updated:2021-02-10 10:35:35.0  )
ప్రమాణ స్వీకారంపై గ్రేటర్ కార్పొరేటర్ల అభ్యంతరం!
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇళ్లు కట్టాలన్నా, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా, కొత్త ఉద్యోగంలో చేరాలన్నా మంచిరోజు చూసి మొదలు పెట్టడం సహజంగా మనం చూస్తుంటాం. ఇందుకు ఒకటికి రెండు సార్లు పండితున్ని కలిసి మంచిరోజు ఎప్పుడుందని తెలుసుకుని ముందుకు వెళ్లడం చేస్తుంటాం. అటువంటిది ఐదేళ్లపాటు పదవిలో ఉండాల్సిన కార్పొరేటర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజున పెట్టడం పట్ల పలువురు కార్పొరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి రెండు నెలలు దాటిన అనంతరం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసి మంచి రోజు చూసుకోరా ? అనే ప్రశ్నలను నూతన కార్పొరేటర్లు సంధిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, మజ్లిస్ పార్టీ 44 , కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం గురువారం ప్రమాణ స్వీకారం కోసం ముహుర్తం ఖరారు చేసింది. అయితే కార్పొరేటర్లు మాత్రం ఆరోజు వద్దే వద్దంటున్నారు. ఆరోజు అమావాస్య కావడంతో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే గెజిట్ కూడా ఇచ్చింది. కానీ, కొందరు కార్పొరేటర్లు ఆ రోజున ప్రమాణం చేయబోమంటున్నారు. ఆ రోజు అమావాస్య కావడమే అందుకు కారణమని వారు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story