ఇంకా కొలిక్కిరాని రెవె‘న్యూ’..?

by Shyam |
ఇంకా కొలిక్కిరాని రెవె‘న్యూ’..?
X

దిశ, న్యూస్ బ్యూరో :

తెలంగాణకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు, నిపుణులు వివిధ రకాలుగా కసరత్తు చేస్తున్నారు. అవి కొలిక్కి మాత్రం రావడం లేదు. రూపకర్తల వైఖరే అందుకు కారణమని తెలుస్తోంది. ‘సొంత భాష్యం చెప్పాలి. ప్రైవేటు వ్యక్తులను సూచనలను అడగాలి. వారెక్కడా చెప్పొద్దు. తామే సొంతంగా రూపొందించినట్లుగా చెప్పుకోవాలి’ అన్నదే అందరి దారి. ఉన్నతాధికారులు, కొత్తగా వచ్చిన చేరుతున్నవారూ అదే స్టయిల్లో నడుస్తున్నారని తెలిసింది. ‘‘అన్ని చట్టాలను అందించాలి. వాటి ప్రయోజనాలను, నష్టాలను అధ్యయనం చేసివ్వాలి. ఏదో ఒకటి తీసుకుంటాం’’ అనే తీరు ప్రభుత్వ పెద్దలు, కొందరు అధికారుల్లో కనిపిస్తోంది. వాళ్లకేం కావాలో చెప్పడం లేదని ఓ రెవెన్యూ నిపుణుడు అన్నారు. రెవెన్యూ కోడ్, రికార్డ్ ఆఫ్ రెవెన్యూ, టైటిల్ గ్యారంటీ వంటి చట్టాలను అధ్యయనం చేయడానికే సీఎం మెచ్చిన బృందం పరిమితమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చట్టాలను రూపొందించడం అసాధ్యం. రెవెన్యూ ట్రిబ్యునళ్లు, టైటిల్ గ్యారంటీ, టైటిల్ రెవెన్యూ కోడ్ వంటివి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నవే. వాటిలో నుంచి తెలంగాణకు అనుకూల అంశాలను స్వీకరిస్తే సరిపోతుందని నిఫుణులు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం తప్ప మరో మార్గమే లేదని తేటతెల్లమైంది. అధికారుల పేర్ల మార్పిడి, అధికారాల మార్పిడి, బాధ్యతల నిర్వహణ వంటి అంశాలపై పెద్దగా వివాదాలేవీ తలెత్తవు. భూ పరిపాలనను ప్రజలకు మెరుగైన సేవలందించే తీరున రూపొందిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ప్రధానంగా ఐదు ప్రాక్టీసెస్ పై సీఎం నియమించిన బృందం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

బిహార్ చట్టాలు అనుసరణీయం..

రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. భూ వివాదాలను సత్వరం పరిష్కరించేందుకు పరిష్కార చట్టం ఉంది. ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్. సివిల్ కోర్టుకు వెళ్లకుండా మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు. హైకోర్టుకు కేసులు వెళ్లవు. ట్రిబ్యునల్ లోనే పరిష్కారమవుతాయి. ఈ ఐదేండ్లలో బీహార్లో 14 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని రెవెన్యూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ కుమార్ ‘దిశ’కు వివరించారు. దీన్ని యథాతథంగా అమలు చేయొచ్చునని, 2013లో అప్పటి కేంద్ర మంత్రి జయరాం రమేష్ కాలంలోనే అన్ని రాష్ట్రాలకు పంపారు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే అమల్లోకి తీసుకొచ్చాయి.

2011లోనే టైటిల్ గ్యారంటీ చట్టం..

2011లోనే యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ చట్టాన్ని రూపొందించింది. 2018లో ఎన్డీయే ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్వోఆర్ చట్టంలో ఇప్పుడున్న రికార్డులను ఎవరైనా తప్పని నిరూపిస్తే తప్ప అవన్నీ సరైనవే. పహాణీలు, సేత్వార్.. ఏం ఉన్నా తప్పని రుజువుచేస్తే వాటిని సరిదిద్దే అవకాశం ఉంది. టైటిల్ గ్యారంటీ చట్టంలో రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలి. దాన్ని టైటిల్ గ్యారంటీగా పిలుస్తున్నారు. కంక్లూజివ్ టైటిల్.. అంటే ఎవరూ మార్చలేనిది. టైటిల్ ఇన్సూరెన్స్.. ఉదాహరణకు కారుకు ఇన్సూరెన్స్ చేస్తే ఎలాంటి డ్యామేజీ జరిగినా నష్టపరిహారం లభిస్తుంది. ఇక్కడా టైటిల్ లో ఎలాంటి నష్టం వాటిల్లినా అలాంటి పరిహారం ప్రభుత్వమే చెల్లించాలి. రాజస్థాన్ లో 2016, ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. రెరా చట్టంలోనూ దీన్ని చేర్చారు. ఐతే అమల్లోకి తీసుకురావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

భూమి, కావేరి..

కర్నాటక రాష్ట్రంలో భూమి, కావేరి అనే రెండు ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. భూమి ప్రాజెక్టు కింద రెవెన్యూ రికార్డులను కంప్యూటీకరిస్తున్నారు. కావేరి ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుసంధానం చేస్తున్నారు. ఎవరైనా భూమిని కొనుగోలు చేస్తున్నారంటే సేల్ డీడ్ లోనే సర్వే మ్యాపును జత చేయాల్సిందే. సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్సులు జారీ చేశారు. దీన్ని ఇంక్రిమెంటల్ సర్వేగా పిలుస్తున్నారు. స్టెప్ బై స్టెప్ సర్వే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్సులు జారీ చేస్తున్నారు. దీని ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తికి హద్దుల పంచాయతీ తలెత్తదు. కొనుగోలుకు ముందుగానే చుట్టూ ఉన్న పట్టాదారులను సంప్రదించి సర్వే నిర్వహించడంతో భవిష్యత్తు వివాదాలకు కాలం చెల్లింది.

ఇంటి స్థలానికి టైటిల్ గ్యారంటీ..

వ్యవసాయ భూములకే కాదు. ఇంటి స్థలాలకు కూడా టైటిల్ గ్యారంటీ ఇచ్చే చట్టాలు అందుబాటులోకి వచ్చాయి. మహారాష్ట్రంలో ఇంటి స్థలాలు (ఆబాది) సర్వే చేసి డిజిటల్ కార్డులను జారీ చేస్తోంది. దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. దీనికి యూజర్ చార్జీలను వసూలు చేస్తున్నారు. దాంతో ప్రభుత్వానికి ఆర్ధిక భారం లేదు. దీని ద్వారా ఇంటి స్థలం విలువ ఖరారవుతుంది. దాంతో రుణాలు పొందే సదుపాయం కలుగుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ‘స్వామిత్వ’ కార్డులను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

కొత్తగా అవసరం లేదు..

కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించిన చట్టాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. పలు అంతర్జాతీయ సంస్థలు రెవెన్యూ చట్టాలను రూపొందించాయి. వరల్డ్​ బ్యాంకు ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ ఫ్రేం వర్క్ చేసి పెట్టింది. దాని ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చింది. అందులో ఉమ్మడి ఏపీ కూడా ఉన్నది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రక్రియ కొనసాగింది. రేటింగ్ టూల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. బెస్ట్ ప్రాక్టీసెస్ లో వరల్డ్ బ్యాంకు పారా లీగల్ ప్రొగ్రాం కూడా ఒకటి. దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే వదిలేశారు. పేదలకు న్యాయం పొందేందుకు సులువైన విధానంగా ఉండేది.

– ఎం.సునీల్ కుమార్, భూ చట్టాల నిపుణులు

Advertisement

Next Story