తెరపైకి ‘పీవీ’ పేరుతో జిల్లా.. కేసీఆర్ ప్రకటన ఆరోజేనా.?

by Anukaran |   ( Updated:2021-06-06 00:23:39.0  )
తెరపైకి ‘పీవీ’ పేరుతో జిల్లా.. కేసీఆర్ ప్రకటన ఆరోజేనా.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భారత దేశానికి ఆర్థిక పితామహుడు, బహుభాషా కోవిదుడు, అపర చాణుక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నెల 28న ఆయన వందో జయంతి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరును చిరస్థాయిలో నిలిపే విధంగా చొరవ తీసుకుంటుందన్న ఆకాంక్షతో ఉన్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఏడాది పాటుగా పీవీ శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పీవీకి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో కొత్తగా హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుందన్న వాదన వినిపిస్తున్నారు.

హుజురాబాద్‌లో అయితే..

పాత తాలుకా కేంద్రమైన హుజురాబాద్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగర.. పీవీ నరసింహరావు స్వగ్రామం. సమీపంలోనే ఉన్న హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసి వరంగల్ అర్బన్ జిల్లాలో చేర్చిన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌తో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజురాబాద్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్, చిగురుమామిడి మండలాలను కలుపుతూ పీవీ జిల్లా ఏర్పాటు చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల అటు పీవీ నరసింహరావును సముచితంగా గౌరవించుకున్నట్టుగా ఉండటంతో పాటు రవాణా సౌకర్యం విషయంలోనూ సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హుజురాబాద్ ప్రాంత వాసులు ఆందోళనలు చేశారు. ఈ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లోని సరిహద్దు గ్రామాలను కలుపుకుంటూ ఓ మండలం, వీరభద్రస్వామి కొలువై ఉన్న కొత్తకొండను, పీవీ పుట్టిన వంగర కేంద్రంగా రెండు నూతన మండలాలను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుందంటున్నారు స్థానికులు.

వరంగల్ కేంద్రీకృతంగానే..

వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు రెండు కూడా త్రైసిటీ కేంద్రంగానే సేవలు అందిస్తున్నాయి. రెండు జిల్లా కేంద్రాలు ఒకే చోట ఉండటం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం కష్టమేనంటున్న వారూ లేకపోలేదు. వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేస్తే హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లోని మండలాలు, గ్రామాలు అభివృద్ధి వైపు పయనించే అవకాశం ఉండటంతో పాటు ఈ ప్రాంత వాసులకు జిల్లా అధికార యంత్రాంగం సేవలను చేరువ చేసినట్టు అవుతుందని ఉద్యమకారులు చెప్తున్నారు.

ఇప్పుడే ప్రకటన చేస్తే..

హుజురాబాద్‌లో మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్.. జిల్లా కేంద్రంగా చేయనున్నామని ప్రకటన చేస్తే ఉప ఎన్నికల్లో కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన సంతోషంలో ఓటర్లు టీఆర్ఎస్‌కు మరింత అనుకూలంగా మారుతారన్న అభిప్రాయలను స్థానిక నాయకుడు ఒకరు వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరిట జిల్లాను ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల్లోనూ సంతోషం వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed