Yogi Adityanath : ప్రియాంకాగాంధీ పాలస్తీనా బ్యాగుపై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు

by Hajipasha |   ( Updated:2024-12-17 12:34:21.0  )
Yogi Adityanath : ప్రియాంకాగాంధీ పాలస్తీనా బ్యాగుపై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘పాలస్తీనా’ అని రాసి ఉన్న హ్యాండ్ బ్యాగు(Palestine bag)ను ధరించి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పార్లమెంటుకు వెళ్లిన అంశంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) స్పందించారు. ఓ వైపు పాలస్తీనా బ్యాగుతో కాంగ్రెస్ నాయకురాలు పార్లమెంటులో తిరుగుతుంటే.. మరోవైపు తమ రాష్ట్రం నుంచి 5,600 మందికిపైగా యువత ఇజ్రాయెల్‌‌(Israel)కు వెళ్లారని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగ పనులు చేస్తున్న యూపీ యువతకు ప్రతినెలా రూ.1.50 లక్షల శాలరీ, ఉచిత వసతి, ఆహారంతో పాటు పూర్తి భద్రతను కల్పిస్తున్నారని యోగి చెప్పారు. మంగళవారం రోజు యూపీ అసెంబ్లీలో పాలస్తీనా హ్యాండ్ బ్యాగు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే ప్రియాంక నోరు విప్పడం లేదు. కానీ పాలస్తీనా బ్యాగు వేసుకొని ఫ్యాషన్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు’’ అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. దీనికి ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇస్తూ.. ‘‘నేనేం ధరించాలనేది ఎవరు నిర్ణయిస్తారు ? బీజేపీ వాళ్లది పురుషాధిక్య భావజాలం. అందుకే తాము చెప్పిన విధంగానే మహిళల వస్త్రధారణ ఉండాలని వాదిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగాలంటే అక్కడి ప్రభుత్వంతో భారత సర్కారు చర్చించాలి. ఏది పడితే అది వాగితే సమస్య పరిష్కారం కాదు’’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story