బీజేపీ ఆదాయం రూ.4,340 కోట్లు

by John Kora |
బీజేపీ ఆదాయం రూ.4,340 కోట్లు
X

- దేశంలో సంపన్నమైన పార్టీ ఇదే

- కాంగ్రెస్ ఆదాయం రూ.1,225 కోట్లు

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీ బీజేపీ అని ఒక అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత స్థానంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.4,340.47 కోట్ల మేర ఆదాయం రాగా.. ఆ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు రూ.1,225.1 కోట్ల ఆదాయం ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. బీజేపీకి వచ్చిన ఆదాయంలో కేవలం 50.96 శాతం, అనగా రూ.2,211.69 కోట్ల మాత్రమే ఖర్చు చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 83.69 శాతం ఖర్చు పెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ 2023-24లో రూ. 1,025.24 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీఆర్ సంస్థ తెలిపింది. సీపీఎం పార్టీ ఆదాయం రూ.167.63 కోట్లు కాగా, రూ.127.28 మేర ఖర్చు చేసింది. ఇది సీపీఎంకు వచ్చిన ఆదాయంలో దాదాపు 76 శాతం. ఇక బీఎస్పీ పార్టీకి రూ.64.77 కోట్ల ఆదాయం రాగా.. రూ.43.18 కోట్లు ఖర్చు పెట్టింది. 2023-24 ఆదాయాలకు సంబంధించి 2024 అక్టోబర్ 31లోగా ఆడిటెడ్ రిపోర్టులు అందించాల్సి ఉండగా.. కేవలం బీఎస్సీ, ఆప్ మాత్రమే నిర్ణీత సమయం లోగా అందించాయి. సీపీఐ పార్టీ 12 రోజుల ఆలస్యంగా, కాంగ్రెస్ 53 రోజులు, బీజేపీ 66 రోజుల ఆలస్యంగా తమ ఆడిట్ రిపోర్టును అందించాయి. 2014 నవంబర్ 19న అన్ని రాజకీయ పార్టీలు తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన రిపోర్టును అందించాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలో ప్రతీ ఏడాది తమకు వచ్చిన విరాళాలు, పెట్టిన ఖర్చుకు సంబంధించిన వివరాలను అందిస్తున్నాయి. బీజేపీకి 2023-24లో వచ్చిన మొత్తం ఆదాయం.. ఆరు జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 75 శాతం మేర ఉండటం గమనార్హం. అన్ని రాజకీయ పార్టీలు చందాలు, విరాళాల ద్వారా తమ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూపన్లను జారీ చేయడం ద్వారా రూ.58.55 కోట్లను సేకరించినట్లు పేర్కొంది.

Next Story

Most Viewed