ఇంటర్ తర్వాత మూడేళ్ల లా కోర్సు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

by S Gopi |
ఇంటర్ తర్వాత మూడేళ్ల లా కోర్సు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: 12వ తరగతి లేదా ఇంటర్ తర్వాత మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సు చదివేందుకు అవకాశం ఉండాలనే దాఖలైన పిటిషన్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లకు బదులుగా మూడేళ్ల లా కోర్సు నిర్వహంచేందుకు సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఐదేళ్ల ఎల్ఎల్‌బీ (బ్యాచిలర్ ఆఫ్ లా) కోర్సు బాగానే ఉందని, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం డిగ్రీ అయిన తర్వాత మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ పూర్తయిన తర్వాత ఐదేళ్ల లా కోర్సులో చేరేందుకు అర్హత ఉంటుంది. అయితే, ఇంటర్ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సు చేసేందుకు కమిటీ నియమించేలా కేంద్రం, బార్ కౌన్సిల్‌కు ఆదేశాలివ్వాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. మేధావులైన విద్యార్థులు మూడెళ్లలోనే న్యాయవాద కోర్సును పూర్తి చేస్తారని, ఇప్పుడున్న ఐదేళ్ల కోర్సు కారణంగా సమయం వృధా అవుతుందని పిటిషన్‌లో వివరించారు. ఐదేళ్ల కోర్సు మూలంగా పేదలు, ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్.. 'మూడేళ్లు కూడా ఎందుకు? హైస్కూల్ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్ చేసేయండి ' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి న్యాయవాద విద్యకు ఐదేళ్ల కోర్సు కూడా తక్కువ సమయమే. ప్రస్తుతం ఉన్న విధానం సరిగానే ఉంది. దీని గురించి విడిగా ఆలోచించే పనిలేదు. ప్రస్తుతం జిల్లాస్థాయి న్యాయవ్యవస్థల్లో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. భవిష్యత్తులో చాలామంది చేరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed