బీజేపీ ఇప్పటికే 310 మార్కును దాటింది.. కాంగ్రెస్ 40 కూడా దాటలేదు: అమిత్‌షా

by Harish |   ( Updated:2024-05-23 11:43:33.0  )
బీజేపీ ఇప్పటికే 310 మార్కును దాటింది.. కాంగ్రెస్ 40 కూడా దాటలేదు: అమిత్‌షా
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఐదు దశల్లో ఇండియా కూటిమి తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా అన్నారు. తొలి ఐదు రౌండ్ల పోలింగ్‌లో బీజేపీ 310 దాటిందని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రాలేదని అమిత్ షా గురువారం దొమరియాగంజ్‌‌ బీజేపీ అభ్యర్థి జగదాంబిక పాల్‌కు మద్దతుగా సిద్ధార్థనగర్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని షా తెలిపారు. పీఓకే తమదేనని పాకిస్థాన్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని అంటున్నారు. బీజేపీకి అణుబాంబులంటే భయం లేదు. పీఓకే భారత్‌లో భాగమేనని, దానిని వెనక్కి తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రతిపక్ష కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి కూడా లేరని, కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు చొప్పున ఐదుగురు ప్రధానులు ఉంటారు, ఇలా ఉంటే దేశం నడవగలదా? అని ఆయన అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో రాహుల్‌బాబా, అఖిలేష్‌యాదవ్‌లు కళ్లకు గంతలు కట్టారని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేసి వాటిని ఎస్టీ/ఎస్టీ, ఓబీసీలకు తిరిగి ఇస్తామని షా అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ విదేశాలకు విహారయాత్రకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని షా ఆరోపించారు.

ఒకవైపు ఇటలీ, థాయ్‌లాండ్‌, బ్యాంకాక్‌లకు వెళ్లే రాహుల్‌ గాంధీ, మరోవైపు 23 ఏళ్లుగా ఎలాంటి సెలవు తీసుకోని, సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్న నరేంద్ర మోడీ ఉన్నారని అమిత్‌షా చెప్పారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని షా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed