రన్‌వేపై వీధి కుక్క.. ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగిన విమానం

by GSrikanth |
రన్‌వేపై వీధి కుక్క.. ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగిన విమానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోవా ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపైకి వీధి కుక్క రావడంతో విస్తారా విమానం ల్యాండ్‌ అవ్వకుండానే వెనుదిరిగిన విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు తాజాగా వెల్లడించారు. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే 881 ఫ్లైట్‌ బెంగళూరు లోని కెంపెగౌడ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి సోమవారం మధ్యాహ్నం బయలుదేరగా.. 2 గంటలకు గోవా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. కానీ ల్యాండ్‌ కావడానికి కొద్దిసేపు ముందు రన్‌వేపై వీధి కుక్కను గుర్తించిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు.

కాసేపు ల్యాండ్‌ చేయకుండా పైలట్‌ను ఆపినట్లు గోవా విమానాశ్రయం డైరెక్టర్‌ ఎస్‌వీటీ రావు తెలిపారు. అయితే, కాసేపటికి విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఆ తర్వాత విమానం మళ్లీ బెంగళూరు నుంచి 4.55 గంటలకు బయలుదేరి 6.15 గంటలకు గోవా చేరుకుంది. ఆ సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రయాణికులు గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story