విశాఖకు కొత్త రైల్వే జోన్.. నూతన పన్ను చట్టం

by Ajay kumar |
విశాఖకు కొత్త రైల్వే జోన్.. నూతన పన్ను చట్టం
X

- సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ పొడిగింపు

- స్కిల్ ఇండియా కార్యక్రమానికి రూ.8,800 కోట్లు

- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

దిశ, నేషనల్ బ్యూరో: విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ నేతృత్వంలో శుక్రవారం భేటీ అయిన యూనియన్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకు వివరించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఇక ఇప్పటి వరకు ఉన్న వాల్తేర్ డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్‌లో పలాస-విశాఖపట్నం-దువ్వాడ, కూనేరు - విజయనగరం, నౌపాడ జంక్షన్ - పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్-సాలూరు, సింహాచలం నార్త్-దువ్వాడ బైసాప్, వడ్లపూడి-దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్-జగ్గాయపాలం మధ్యన ప్రాంతాలు ఉంటాయి. ఇక కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసింది. దీన్ని ఈస్టో కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొని వచ్చింది.

కొత్త ఇన్‌కం ట్యాక్స్ చట్టం..

కొత్త ఇన్‌కం ట్యాక్స్ చట్టానికి మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 1961లో రూపొందించిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేవపెట్టనున్నారు. అంతకు ముందు దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతారు. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు. ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే ట్యాక్స్ పేయర్స్‌కు లాభదాయకంగా ఉండనుంది. ఇకపై ఐటీ రిటర్స్ దాఖలు చేయడం సులభతరం కానుంది. అంతే కాకుండా ఆదాయపు పన్ను దాఖలు సమయంలో జరిగే చిన్న పొరపాట్లకు విధించే భారీ జరిమానాలు కూడా తగ్గనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త చట్టం అమలులోకి రానుండగా.. 2026-27 నుంచి పన్ను అసెస్‌మెంట్లకు ఇది వర్తించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

పారిశుథ్య కార్మికుల కోసం..

జాతీయ సఫాయి కర్మచారి కమిషన్‌ను మరో మూడేళ్ల పాటు పొగిడిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.50.91 కోట్లను కూడా కేటాయించింది. ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో 2028 మార్చి 31 దాకా దీని గడువును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పారిశుథ్య కార్మికులు సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఈ కమిషన్ పాటు పడుతుంది. అంతే కాకుండా పని ప్రదేశంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది.

స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.8,800 కోట్లు..

స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌ను మరింత ప్రోత్సహించేందుకు రూ.8,800 కోట్లు కేటాయించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంతో పాటు, పరిశ్రమ ఆధారిత అవకాశాలు కూడా అందించనున్నారు. పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాల్లో యువతను సన్నద్ధం చేయడంతో పాటు అట్టడుగు వర్గాలను వ్యాపారాల వైపు మళ్లించేలా శిక్షణ ఇవ్వనున్నారు. పీఎం కౌశల్ వికాస్ యోజనకు రూ.6,000 కోట్లు, జన్‌శిక్షణ్ సంస్థాన్‌కు రూ.858 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.



Next Story

Most Viewed