PM Modi : 8 హైస్పీడ్ రోడ్ కారిడార్లతో భారీగా ఉద్యోగాలు : ప్రధాని మోడీ

by Hajipasha |
PM Modi : 8 హైస్పీడ్ రోడ్ కారిడార్లతో భారీగా ఉద్యోగాలు : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎనిమిది నేషనల్ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని గొప్ప విషయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. రానున్న కాలంలో దేశ ఆర్థిక పురోగతిపై ఈ నిర్ణయం తప్పకుండా గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా మంజూరైన ఎనిమిది రోడ్ కారిడార్ ప్రాజెక్టుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.50,655 కోట్లు ఖర్చు చేయబోతోందని ప్రధాని తెలిపారు. 938 కి.మీ పొడవునా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుల వల్ల పెద్దసంఖ్యలో ఉద్యోగావకాశాలు కూడా ఏర్పడుతాయన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానానికి తమ ప్రభుత్వ నిర్ణయాలు బాటలు వేస్తాయని మోడీ పేర్కొన్నారు.

ఇదే అంశాన్ని కేంద్ర సమాచారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరిస్తూ.. ‘‘8 నేషనల్ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల వల్ల దాదాపు 4.42 కోట్ల పనిదినాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారు’’ అని వెల్లడించారు. కొత్తగా మంజూరైన ఎనిమిది రోడ్ ప్రాజెక్టుల జాబితాలో.. 6 లేన్ల ఆగ్రా-గ్వాలియర్ హైవే, 4 లేన్ల ఖరగ్‌పూర్ - మోర్‌గ్రామ్ హైవే, 6 లేన్ల తరద్ - దీసా - మెహసానా - అహ్మదాబాద్ హైవే.. పథల్ గావ్, రాయ్ పూర్-రాంచీ రూట్‌లోని గుమ్లా మధ్య 4 లేన్ల హైవే, కాన్పూర్ రింగ్ రోడ్‌పై 6 లేన్ల హైవే, 4 లేన్ల నార్తెర్న్ గువహటి బైపాస్, గువహటి బైపాస్ విస్తరణ, పుణె సమీపంలోని నాసిక్ ఫాటా - ఖేడ్ కారిడార్‌లో 8 లేన్ల ఎలివేటెడ్ హైవే ఉన్నాయి.

Advertisement

Next Story