గిగ్ వర్కర్లకు భారీ ఊరట

by John Kora |
గిగ్ వర్కర్లకు భారీ ఊరట
X

- ఈ-శ్రమ్ ద్వారా ఐడీ కార్డులు

- ఉచిత ఆరోగ్య బీమా

- స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వర్కర్లలో ఉత్సాహం

దిశ, నేషనల్ బ్యూరో:

కేంద్ర బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లను ఆనందంలో ముంచెత్తింది. అసంఘటితంగా ఉన్న ఈ గిగ్ వర్కర్లందరినీ గుర్తిస్తూ ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వనున్నారు. అంతే కాకుండా పీఎం జన్ ఆరోగ్య యోజన కింద వారికి ఉచిత ఆరోగ్య బీమా లభించనున్నట్లు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న గిగ్ వర్కర్లు ఇకపై ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటి వారికే ఈ పోర్టల్‌లో నమోదుకు అవకాశం ఉండేది. కానీ ఇకపై ఓలా, జొమాటో, స్విగ్గీ, ఉబర్, అర్బన్ క్లాప్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో డెలివరీ బాయ్స్, డ్రైవర్లుగా పని చేస్తున్న వారు కూడా నమోదు చేసుకునే వీలుంటుంది. దీని వల్ల దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు లబ్ది చేకూరుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పురోగతిని సాధించడానికి ఈ సదుపాయం తీసుకొని వచ్చినట్లు మంత్రి చెప్పారు.

దేశంలో ఈ-కామర్స్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇందులో కీలక భాగస్వాములుగా ఉన్న గిగ్ వర్కర్లు అసంఘటింతగా ఉన్నారు. వారందరినీ ఏక తాటికి తీసుకొని వచ్చి, ప్రభుత్వపరంగా అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా లభించేలా ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కాగా, మంత్రి ప్రకటనలో ఈ-కామర్స్ రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది డెలివరీ బాయ్స్, డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండనకా, వాననకా.. రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్న తమకు ఉచిత ఆరోగ్య బీమా అందించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed