Tungabhadra: తుంగభద్ర గేట్లకు 4-5 రోజుల్లో మరమ్మతులు: డీకే శివకుమార్‌

by Harish |
Tungabhadra: తుంగభద్ర గేట్లకు 4-5 రోజుల్లో మరమ్మతులు: డీకే శివకుమార్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో శనివారం రాత్రి తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోవడంతో రిజర్వాయర్ నుండి భారీగా నీరు బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం డ్యామ్‌ను సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిని అక్కడి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్యామ్ గేటును పునరుద్దరించడానికి నీళ్లను కొంత వరకు ఖాళీ చేయాల్సి వస్తుంది. రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీల నీటిని దిగువకు వదిలి డ్యామ్ ను ఖాళీ చేస్తేనే రిపేర్ చేయగలుగుతాం. నాలుగైదు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.

డ్యాం నుండి పెద్ద మొత్తంలో నీరు బయటకు వెళ్తున్నప్పటికీ, అక్టోబర్, సెప్టెంబర్ నెలల్లో సుమారు 50-60 టీఎంసీల నీరు తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున పంటలకు తక్షణ ముప్పు లేదని ఆయన అన్నారు. డ్యామ్ దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం జలాశయం వద్దకు ఆయన వెళ్లనున్నారు.

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్‌కు తన శాఖను నిర్వహించడానికి సమయం లేదని ఆరోపించింది. ప్రతిపక్షనేత ఆర్‌.అశోక మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం డ్యామ్‌ టెక్నికల్‌ కమిటీతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పక్కాగా తీర్చిదిద్ది ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. శివకుమార్ తన శాఖను నిర్వహించడం కంటే (కాంగ్రెస్) హైకమాండ్ ఏజెంట్‌గా పని చేయడంలో బిజీగా ఉన్నారు, మొన్నటి కరువు సమయంలో ఖాళీగా ఉన్న డ్యామ్‌ను మరమ్మతు చేయడానికి ప్రభుత్వానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నప్పటికి దాని గురించి పట్టించుకోకుండా, ఎప్పుడూ సీఎం కావాలనే బిజీలో ఉన్నారని బీజేపీ నేత ఆరోపించారు.

Advertisement

Next Story