Lokpal: సెబీ చీఫ్ పై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలి- మహువా మొయిత్రా

by Shamantha N |
Lokpal: సెబీ చీఫ్ పై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలి- మహువా మొయిత్రా
X

దిశ, నేషనల్ బ్యూరో: సెబీ చీఫ్ మాధబి పురి బుచ్ పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ పాల్ లో ఫిర్యాదు చేశారు. మాధబి పురి, ఆమె భర్త అనుచిత ప్రవర్తన, క్విడ్ ప్రోకో ద్వారా నిమగ్నమై ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టం ఉల్లంఘనలపైన విచారణ జరిపించాలని లోక్‌పాల్‌ను మోయిత్రా కోరారు. “మాధబి పురి, ఆమె భర్త ధవల్ బుచ్ పై ఎలక్ట్రానిక్ రూపంలో, ప్రత్యక్షంగానూ లోక్ పాల్ లో ఫిర్యాదు చేశారు. లోక్ పాల్ ఫిర్యాదుని పరిశీలించి 30 రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తు కోసం సీబీఐ లేదా ఈడీ విచారణ చేసేలా చూడాలి. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. ప్రతి లింక్ పైనా ఆరాలు తీయాలి” అని మొయిత్రా సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది. ఇక, సెబీ చీఫ్‌పై వస్తున్న ఆరోపణల వల్ల స్టాక్ మార్కెట్ లో ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా పెట్టుబడిదారులుగా ఉన్న 10 కోట్ల మంది సామాన్యులపై ఇది ప్రభావం చూపుతోంది. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా దీన్ని పరిగణించి వెంటనే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ ఆరోపణలు

సెబీ చీఫ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తుండగా.. మహువా మొయిత్రా లోక్ పాల్ లో ఫిర్యాదు చేయడం విశేషం. 2017 నుంచి 2021 వరకు సెబీ సభ్యురాలిగా ఉన్న మాధవీ బుచ్‌.. 2022 మార్చిలో సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. సెబీలో చేరినప్పటికీ ఆమె ఐసీఐసీఐ బ్యాంకు అధికారి హోదాలో జీతభత్యాలు అందుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సెబీ చీఫ్‌గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి వేతనం ఎందుకు తీసుకుంటున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే 2013 అక్టోబరు 31న ఆమె పదవీవిరమణ చేసిన తర్వాత నుంచి అందుకు సంబంధించిన ప్రయోజనాలు మినహా ఎటువంటి వేతనం చెల్లించడం లేదని ఐసీఐసీఐ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

Advertisement

Next Story