డిప్యూటీ సీఎం భార్యకే బెదిరింపులు.. 750 కిలోమీటర్లు ఛేజింగ్ చేసి మరి..

by Sathputhe Rajesh |
డిప్యూటీ సీఎం భార్యకే బెదిరింపులు.. 750 కిలోమీటర్లు ఛేజింగ్ చేసి మరి..
X

దిశ, వెబ్‌డెస్క్: నిందితుడి కోసం పోలీసుల 72 గంటల పాటు ఆపరేషన్ ఏజే పేరిట గాలింపు చర్యలు చేపట్టి, దాదాపు 750 కిలో మీటర్లు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అనిల్ జై సింఘానీ‌ను పోలీసులు సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు జై సింఘానీ తరచూ ఫోన్లను మార్చేవాడు. దీంతో రెండు సార్లు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. చివరికి అతడిని వడోదర సమీపంలోని కోలాల్ వద్ద ఆదివారం రాత్రి పక్కా స్కెచ్ వేసి పోలీసులు అరెస్ట్ చేశారు.

జై సింఘానీని మలబార్ హిల్స్ పోలీసులకు అప్పగించారు. అతడిని నేడు కోర్ట్ ఎదుట హాజరు పరచనున్నారు. సైబర్ పోలీసు డీసీపీ బాలా సింగ్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. ఆపరేషన్ ఏజే చేపట్టి జై సింఘానీని గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నాం. అతడు రెండు సార్లు పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకున్నాడు. అతడు చాలా ఎలక్ట్రానిక్ పరికరాలను మార్చాడని తెలిపారు. మహారాష్ట్రలో అతిపెద్ద బుకీలలో ఒకడైన జై సింఘానీపై దాదాపు 15 కేసులు ఉన్నాయి. నిందితుడి మొబైల్ లోకేషన్ తొలిసారిగా గుజరాత్‌లో శుక్రవారం గుర్తించారు. ఆ తర్వాతి రోజు అది సూరత్ కు మారిపోయింది.

పోలీసులు అక్కడికి చేరుకునే సరికి జై సింఘానీ ఎయిర్ పోర్ట్ వద్దకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని వెంటాడి చివరికి కొలాల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తెలివిగా ఫోన్ కాల్‌కు బదులుగా ఇంటర్నెట్ ఆధారిత వీవోఐపీ కాల్స్ మాత్రమే చేస్తాడన్నారు. నిందితుడి నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అనిల్ జై సింఘానీ కుమార్తె అనిక్ష ఏకంగా డిప్యూటీ సీఎం ఫడణవీస్ సతీమణి అమృతాను బెదిరించింది.

తొలుత రూ.కోటి ఇస్తాను తన తండ్రి అనిల్ ను కేసుల నుంచి బయటపడేయమని కోరింది. దానికి అమృతా నిరాకరించడంతో కొన్ని మార్ఫింగ్ వీడియోలను తయారు చేసి వాటిని లీక్ చేస్తానని అమృతాను బెదిరించింది. తనకు రూ.10కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ బెదిరింపులపై అమృతా గతంలో కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనిక్షను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనిల్ జై సింఘానీ గతంలో ఎన్సీపీ తరపున కార్పొరేటర్‌గా పనిచేశాడు.

Advertisement

Next Story