Mayawati: మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. రీజన్ ఏంటో చెప్పిన మాజీ సీఎం

by Prasad Jukanti |
Mayawati: మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. రీజన్ ఏంటో చెప్పిన మాజీ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి (Mayawati) సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ (Akash Anand) ను బీఎస్పీ (BSP) నుంచి సస్పెండ్ చేశారు. నిన్న లక్నోలో జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో అన్ని కీలక పదవుల నుంచి అతడిని తొలగించిన మాయావతి సోమవారం పార్టీ నుంచి బహిష్కరించడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఆకాశ్ తన మామ ప్రభావితంతో పని చేస్తున్నారని ఇది పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశం అని పేర్కొంటూ మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఆకాశ్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్ (Ashok Siddharth) ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ అంశంలో ఆకాశ్ ఆనంద్ పశ్చాతం వ్యక్తం చేస్తాడని భావించినా అతడు రాజకీయ అపరిపక్వత చూపించారని మాయావతి ఎక్స్ వేదికగా సస్పెన్షన్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. వచ్చిన ఆరోపణలపై ఆకాశ్ ఇచ్చిన వివరణ చాలా వరకు తన మామ ప్రభావంతో స్వార్థపూరితంగా, అహంకారపూరితంగా ఉందని ఇది పూర్తిగా పార్టీ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందన్నారు. ఇలాంటి వారు ఇంకా పార్టీలో ఉంటే వారందరూ పార్టీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నానన్నారు. కాగా ఆకాశ్ ను గతంలో మాయావతి తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఈ క్రమంలో అతడిపై ఆరోపణలు రావడంతో ఆ ప్రకటనను ఉపసంహరించుకోవడంతో పాటు పార్టీ నుంచి గతంలోనూ సస్పెండ్ చేశారు. తాజాగా అదే సీన్ మరోసారి రిపీట్ కావడం బీఎస్పీలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed