Bihar: మందు తాగినందుకు 40 మంది అరెస్టు.. ఎక్కడంటే?

by Shamantha N |
Bihar: మందు తాగినందుకు 40 మంది అరెస్టు.. ఎక్కడంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్(Bihar) లో నిబంధనలు ఉల్లంఘించిన 40 మంది అరెస్టయ్యారు. బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌(Muzaffarpur) జిల్లాలో జరిగిన పెళ్లిలో ఈ ఘటన జరిగింది. “ముజాఫర్ పూర్ లో జరిగిన పెళ్లిలో వరుడితో కలిసి పెళ్లి బృందం ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకుంది. అయితే పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న సుమారు 40 మంది వ్యక్తులు మద్యం తాగారు. కొందరు నాగిని డ్యాన్సు చేశారు. పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చే తమ బంధువుల కోసం మద్యం బాటిల్స్‌ తీసుకువచ్చారు.” అని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, వివాహ వేడుకకు హాజరైన వారు ఇతరులకు బహుమతిగా ఇవ్వడానికి మద్యం బాటిళ్లను కూడా తీసుకెళ్లారని తెలిపారు.

మద్యం నిషేధం

కాగా, బీహార్‌లో మద్యంపై నిషేధం(liquor ban) అమలులో ఉంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి బృందం మద్యం సేవించినట్లు సమాచారం అందిందని పోలీసులకు తెలిపారు. వరుడి తరుఫు వారైన 40 మంది వ్యక్తులను అరెస్ట్‌ చేశామన్నారు. వారికి మద్యం అమ్మిన ఏడుగురు లిక్కర్‌ వ్యాపారులను కూడా అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.బాటిల్స్‌తో పాటు రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. బిహార్ లో మద్యపాన నిషేధంపై పాట్నా హైకోర్టు నితీశ్ కుమార్ సర్కారుపై మండిపడింది. నిషేధం వల్లే మద్యం అక్రమ రవాణా, కల్తీ మద్యం సరఫరా జరుగుతోందని పైర్ అయ్యింది.

Advertisement

Next Story