ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కాదు: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్

by samatah |
ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కాదు: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లైనా గెలుస్తుందా అనే అనుమానం ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఇండియా కూటమి నేతలంగా కలిసి ఉంటే మంచిదని, పార్లమెంటు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కాదనే విషయాన్ని గ్రహించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. శనివారం ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇండియా కూటమి 27 పార్టీల సమూహం. మమతా ఇప్పటికీ అలయెన్స్‌లో భాగమనే అనుకుంటున్నాం. బీజేపీతో పోరాడటమే మా ప్రాధాన్యత’ అని చెప్పారు. పలు రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ పై ఇంకా చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం జరిగిన ఓ సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ..కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనికి బదులుగా జైరాం రమేశ్ పై వ్యాఖ్యలు చేశారు.

మొదట మహారాష్ట్ర, ఆ తర్వాత బిహార్

జేఎంఎం నేత చంపై సొరేన్ ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడంపైనా జైరాం రమేశ్ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘మొదట మహారాష్ట్రలో శివసేనను విభజించారు, ఆ తర్వాత బిహార్‌లో నితీశ్ కుమార్ యూ-టర్న్‌కు గురయ్యారు. ఇప్పుడు జార్ఖండ్‌లో హేమంత్ సొరేన్‌పై ఈడీ, సీబీఐలను ప్రయోగించారు. ఇది స్థిరత్వం లేని రాజకీయం’ అని విమర్శించారు. భారత్ జోడో యాత్ర, ఇండియా కూటమి ఏర్పాటుతో బీజేపీ అయోమయంలో పడిందని తెలిపారు. జార్ఖండ్‌లో చంపై ప్రమాణస్వీకారాన్ని కావాలనే ఆలస్యం చేశారని ఆరోపించారు.

Advertisement

Next Story