లెక్క తప్పుతోన్న ఇంటి ‘బడ్జెట్’.. ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1500 నుంచి రూ.2000 వరకు భారం!

by Satheesh |   ( Updated:2023-06-05 05:51:10.0  )
లెక్క తప్పుతోన్న ఇంటి ‘బడ్జెట్’.. ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1500 నుంచి రూ.2000 వరకు భారం!
X

రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, విద్యుత్ చార్జీలతో మోయలేని భారం పడుతుండగా, కూరగాయలు, పప్పుల ధరలు సైతం పెరగడంతో ఇంటి బడ్జెట్ తారుమారవుతున్నది. ఓ వైపు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు పరేషాన్ అవుతుండగా.. ప్రభుత్వాలు సైతం ధరల నియంత్రణలో విఫలమవుతుండడం పేద, మధ్య తరగతి ప్రజలకు శాపంగా మారింది. నెలవారీ బడ్జెట్‌ లెక్కలు అంచనాలు తప్పుతుండగా, ఒక్కో కుటుంబంపై అదనంగా రూ.1500 నుంచి రూ.2000 వరకు అధిక భారం పడుతున్నది.

దిశ , తెలంగాణ బ్యూరో: నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు, పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఏం వండుకొని తినాలన్నా.. ఒకటికి, రెండు సార్లు ఆలోచించాల్సి వస్తున్నది. రిటైల్‌ మార్కెట్‌లో కిలో కంది పప్పు ధర రూ. 120 నుంచి రూ. 150 వరకు పెరిగింది. మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. ఎర్రపప్పు (మసూర్‌ దాల్‌) కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కు చేరింది. వేరుశనగ ధర కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది.

ఇక సూపర్‌ మార్కెట్లు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్‌ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 వరకు పలుకుతున్నది. అంటే అటూఇటూగా కిలో రూ. 200కు చేరుకున్నది. పెసరపప్పు ధరలో పెద్దగా మార్పులేదు. ఇక ఆర్గానిక్‌ పేరుతో ప్యాక్‌ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు సూపర్ మార్కెట్లలో అమ్ముతున్నారు. ఆర్గానిక్ మినపపప్పు ధర కిలో రూ. 150పైగా ఉండగా, ఎర్రపప్పు రూ. 120గా ఉంది. వేరుశనగ నూనెను కిలోకు రూ. 180పైగా మార్టుల్లో అమ్ముతున్నారు. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాలు, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొన్నది.

తగ్గినా దిగుబడితో పెరిగిన డిమాండ్‌!

ధరల పెరుగుదలకు పప్పు ధాన్యాల దిగుబడి తగ్గడం కూడా ఒక కారణంగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గతేడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా, మరో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకున్నది.

కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్‌ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని తాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ గతేడాది పప్పుధాన్యాల దిగుబడి తగ్గింది. పప్పు ధాన్యాలు పండించే సమయంలో చోటుచేసుకున్న వాతావరణ మార్పులు, అన్ సీజనల్ వర్షాల వల్ల నష్టం జరిగింది.

స్టాక్‌.. బ్లాక్‌ మార్కెట్‌కు..?

పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్‌ వంటి ప్రధాన మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే ‘నో స్టాక్‌’బోర్డులు దర్శనమిస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వ్యాపారులు పప్పు ధాన్యాలను స్టాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతంగా పెంచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కొరవడిన పర్యవేక్షణ..?

మార్కెట్లో నిత్యావసరాల ధరలు అమాంతంగా పెరగడం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు నిత్యావసర వస్తువులను పెద్ద ఎత్తున స్టాక్ చేస్తున్నారని, దీంతో మార్కెట్లో ధరలు అధికంగా ఉంటున్నాయని తెలుస్తున్నది. ధరలను కట్టడిచేయాల్సిన అధికారులు సరైన పర్యవేక్షణ, తనిఖీలు చేయకపోవడం వెరసి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సగటు సామాన్యుడు అతికష్టం మీద కాలం వెళ్లదీస్తున్నాడు.

Also Read: లీటర్‌ పెట్రోల్‌ రూ.200.. వంటనూనె రూ.250

Advertisement

Next Story