EC: ఈరోజే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్న ఈసీ

by Harish |
EC: ఈరోజే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్న ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 3న హర్యానా, నవంబర్ 26 న మహారాష్ట్ర శాసన సభ పదవీకాలం ముగుస్తుంది. జార్ఖండ్‌లో కూడా శాసన సభ పదవీకాలం జనవరి 2025లో ముగుస్తుంది. అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే, వీటితో పాటే జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తుంది.

సుప్రీంకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను జమ్మూ కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. విభజన తర్వాత, 2022లో పూర్తయిన డీలిమిటేషన్ కసరత్తుతో సహా వివిధ కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్ట్ సెప్టెంబర్‌ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

ఇటీవల, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల సన్నాహాలను సైతం సమీక్షించింది. ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం జమ్మూ కశ్మీర్, హర్యానాలో పర్యటించింది, కానీ ఇంకా మహారాష్ట్రలో పర్యటించలేదు.

Advertisement

Next Story